కిడ్నీలు మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. ఇవి నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాయి. అందువల్లే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. కిడ్నీలు చెడిపోతే ప్రాణాల మీదకు వస్తుంది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. దాతలు అందుబాటులో లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. కనుక కిడ్నీల ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి. ఇక కిడ్నీలు చెడిపోయే ముందు పలు లక్షణాలు మనలో కనిపిస్తాయి. వాటిని ముందుగానే గుర్తించడం ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సకాలంలో చికిత్స తీసుకుని కిడ్నీలను కాపాడుకోవచ్చు. ఇక కిడ్నీలు చెడిపోతే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీలు చెడిపోయిన వారికి లేదా చెడిపోయే ముందు మూత్రాశయ సమస్యలు వస్తాయి. మూత్రం తరచూ వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రి పూట ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మూత్రం వెళితే మూత్రం సరిగ్గా రాదు. ఈ సమస్య ఎవరిలో అయినా ఉందంటే వారి కిడ్నీలు చెడిపోయాయని అర్థం చేసుకోవాలి. అలాగే మూత్రంలో రక్తం పడుతున్నా కూడా కిడ్నీలు చెడిపోయాయని గుర్తించాలి. మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటే దాన్ని కిడ్నీ డ్యామేజ్‌గా అనుమానించాలి.
కిడ్నీలు చెడిపోయిన వారిలో పాదాల్లో నీరు వస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో మొత్తం వాచిపోయి కనిపిస్తుంది. వేలితో నొక్కితే చర్మం లోపలికి వెళ్తుంది. ఇలా గనక ఉంటే కిడ్నీలు చెడిపోయాయని అర్థం చేసుకోవాలి. అలాగే ఆకలి అసలు లేకపోవడం, కళ్ల కింద వాపులు, కండరాలు పట్టేయడం, చర్మంపై దురద, దద్దుర్లు రావడం, తీవ్రమైన నీరసం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉన్నా కూడా అనుమానించాలి. ఇవన్నీ కిడ్నీలు చెడిపోతే కనిపించే సంకేతాలు. కాబట్టి ఇవి ఉంటే వెంటనే డాక్టర్ ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. కిడ్నీలు బాగా లేవని పరీక్షల్లో తేలితే వెంటనే చికిత్స తీసుకోవాలి. దీంతో కిడ్నీలు చెడిపోకుండా చూసుకోవచ్చు. ప్రాణాల మీదకు రాకుండా కాపాడుకోవచ్చు.