మన శరీరంలో రెండు మూత్రపిండాలు రక్తం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడానికి పనిచేస్తాయి. కానీ మూత్రపిండాలలో ఏమైనా సమస్యలు ఉంటే అవి మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. వివిధ రకాల మూత్రపిండాల సంబంధిత సమస్యల వల్ల లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా మందికి కిడ్నీ సంబంధిత సమస్యల గురించి తెలియడం లేదు. అందుకే కిడ్నీ వ్యాధిని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు.
వ్యాధి తీవ్రమైన రూపం దాల్చిప్పుడే చాలా మందికి మూత్రపిండాల సమస్యల గురించి తెలుస్తుంది. ఈ క్రమంలో వ్యాధి మరింత ముదురుతుంది. అప్పుడు చికిత్స అందించినా ఫలితం ఉండదు. ఇక దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి భారతదేశంలో సంభవిస్తున్న మరణాలకు ఎనిమిది ప్రధాన కారణాలలో ఒకటి. మీ కుటుంబంలో అధిక రక్తపోటు, డయాబెటిస్, ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, మూత్రపిండాల వైఫల్యం యొక్క చరిత్ర ఉంటే మీరు 60 సంవత్సరాల తర్వాత క్రమం తప్పకుండా మూత్రపిండాలను పరీక్ష చేయించుకోవాలి. మూత్రపిండాల సమస్య ఉన్న వారిలో కనిపించే లక్షణాలు ఏమిటో కింద తెలుసుకోండి.
1. మూత్రపిండాలలో ఏదైనా సమస్య ఉంటే మీరు ప్రారంభ దశలో చీలమండలు, కాళ్ళు, మడమల దగ్గర వాపులు చూడవచ్చు.
2. మూత్రపిండాలలో సమస్య ఉంటే ఎడెమా వస్తుంది. ఇందులో కళ్ళ చుట్టూ వాపు కనిపిస్తుంది. ఇది కణాలలో ద్రవం చేరడం వల్ల సంభవిస్తుంది.
3. మూత్రపిండాలలో సమస్య ఉన్నప్పుడు బలహీనత అనేది ఒక సాధారణ లక్షణం. ఇందులో ప్రారంభంలో చాలా అలసట కనిపిస్తుంది. తరువాత ఏదైనా పని చేయడం కష్టం అవుతుంది.
4. మూత్రపిండాల వైఫల్యం కారణంగా ఆకలి తగ్గుతుంది. యూరియా, క్రియేటినిన్, యాసిడ్ వంటి టాక్సిన్స్ శరీరంలోనే చేరడం ప్రారంభిస్తాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. రుచిని కూడా మారుస్తుంది.
5. మూత్రపిండాల వైఫల్య లక్షణాలలో ఉదయం వికారం, వాంతులు ఉంటాయి. ఉదయం దంతాలను తోముకునేటప్పుడు అలా జరుగుతుంది. ఇది ఆకలి తగ్గడానికి కూడా దారితీస్తుంది.
1. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటానికి పుష్కలంగా నీరు తాగాలి. వెచ్చని నీరు తాగడానికి ప్రయత్నించాలి. దీనివల్ల మూత్రపిండాల నుండి సోడియం, యూరియా, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
2. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి తక్కువ ఉప్పును తీసుకోవాలి. రెస్టారెంట్లు లేదా ప్యాక్ చేయబడిన ఆహారాలను తీసుకోకూడదు. వాటిల్లో సోడియం అధికంగా ఉంటుంది. అది మూత్రపిండాలకు హాని కలగజేస్తుంది.
3. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. రోజూ అన్ని రకాల పోషకాలు శరీరానికి అందేలా చూసుకోవాలి. అలాగే మీ బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.
4. మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడానికి ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ స్థాయిలను టెస్ట్ చేయించుకోవాలి. ఏదైనా తేడా ఉంటే డాక్టర్ సూచన మేరకు మందులను వాడాలి. జంక్ ఫుడ్, నూనె పదార్థాలు, ఇతర చిరుతిళ్లను మానేయాలి.
5. వేయించిన, తీపి ఆహారాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు తినాలి. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365