Liver Health : తరచూ కడుపునొప్పితో బాధపడుతున్నవారు, వాంతులు అవుతుండడం, వికారం వంటి లక్షణాలు ఉన్నవారు, అలసటగా అనిపించే వారు.. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లివర్ పెరిగితే ఈ లక్షణాలన్నీ కనిపిస్తుంటాయి. కనుక ఈ లక్షణాలు కనిపిస్తే ఎవరైనా సరే జాగ్రత్త పడాల్సిందే. నిర్లక్ష్యం చేస్తే అది సైలెంట్ కిల్లర్‌గా మారుతుంది. కనుక సరైన సమయంలో స్పందించాల్సి ఉంటుంది.
వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. లివర్ పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి. లివర్ సిర్రోసిస్ లేదా ఫ్యాటీ లివర్ అనే సమస్య వచ్చినప్పుడు లివర్ పెరిగి ఇబ్బందులకు గురవుతుంది. అలాగే మద్యం ఎక్కువగా సేవించేవారు, అధిక బరువు ఉన్నవారు, గాల్ బ్లాడర్‌లో అడ్డంకులు ఏర్పడిన వారు, హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్ ఉన్నవారిలో లివర్ పెరుగుతుంది.
లివర్ పెరగడం అనేది ఒక తీవ్రమైన సమస్య. అందువల్ల పైన తెలిపిన లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. లివర్ పెరిగినట్లు పరీక్షల్లో తేలితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స ప్రారంభించాలి. దీంతో ప్రాణాపాయం ముప్పు తప్పుతుంది.
లివర్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే లివర్ ఫెయిల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఎప్పటికప్పుడు లివర్ ఫంక్షన్ టెస్టును కూడా చేయించుకోవాలి. దీని వల్ల లివర్‌లో ఏమైనా సమస్యలు ఉంటే తెలిసిపోతుంది. అందుకు అనుగుణంగా చికిత్స తీసుకుని లివర్ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.
ఇక లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే మద్యం సేవించడం పూర్తిగా మానేయాలి. లేదా పరిమిత మోతాదులో తీసుకోవాలి. చక్కెర, ఉప్పు, మైదా పిండి వాడకాన్ని తగ్గించాలి. నూనె వాడకం కూడా తగ్గించాలి. కూరగాయల రసాలు, నట్స్‌ను రోజూ తీసుకోవాలి. దీంతో లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది.