ఈ రోజుల్లో తలనొప్పి కామన్‌గా వస్తూ ఉంటుంది. మన శరీరంలో ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే ముందుగా తల నొప్పి బయట పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఎటువంటి తల నొప్పి వచ్చినా నిర్లక్ష్యం చేయకుడదు. మైగ్రేన్ తల నొప్పి, ఒంటి పార్శ్వపు నొప్పి, టెన్షన్ తల నొప్పి, సైనస్ తల నొప్పి, క్లస్టర్ తల నొప్పి, అలెర్జీ తల నొప్పి.. ఇలా మొత్తం మీద 25 రకాలకు పైగా తల నొప్పలున్నాయట.చాలామందికి తరచూ తల అంతా నొప్పి రాకుండా తలలోని ఒక భాగం మాత్రమే నొప్పి వస్తుంది. తీవ్ర ఒత్తిడికి గురైన సమయంలో అది మరింత పెరుగుతుంది. అలా తీవ్రమైన నొప్పి అనేక సమస్యలకు దారి తీస్తాయంటున్నారు నిపుణులు.
వెన్నెముకలో అన్నింటికన్నా పైన ఉండే వెన్నుపూస అట్లాస్ సీ1. ఇది పుర్రెను, రెండో వెన్నుపూసను కలుపుతుంది. తలను మోస్తూ.. తల కదలడానికి ఇది తోడ్పడుతుంది. ఏవైనా దెబ్బలు తగిలినా.. రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్ వంటి వ్యాధి సోకినా ఈ వెన్నుపూస అది ఉన్నచోటు నుంచి జరుగుతుంది. అప్పుడు అక్కడ ఉండే నాడి నొక్కుకుపోతుంది. దీనికి అనుసంధానంగా ఉన్న కీలు కూడా దెబ్బతినవచ్చు. తల వెనకాల, మెడ పైభాగంలో నొప్పి రావడానికి ఇదొక కారణమని వైద్యులు చెబుతున్నారు.. కొందరికి తలకు ఒకవైపున నొప్పి కూడా రావొచ్చు. తలలో ఏదో పొడుస్తున్నట్టు, బాదుతున్నట్టుగా నొప్పి పుడుతుంది.అయితే దీన్ని కచ్చితంగా గుర్తించటం అవసరం.
స్పెషల్ సీక్వెన్స్ ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, సీటీ సర్వైకల్ స్పైన్ పరీక్షలతో నిశితంగా పరిశీలించి నిర్ధరించాల్సి ఉంటుంది. తలను పైకెత్తినప్పుడు, కిందికి దించినప్పుడు పూస ఎలా ఉంటోంది, ఎటువైపునకు జరుగుతుందనేది వీటిల్లో తెలుస్తుంది. ఒకవేళ అట్లాస్ పూస నిజంగానే స్థానభ్రంశం చెందినట్టు తేలితే సర్జరీతో సరి చేయాల్సి ఉంటుంది. మీరు న్యూరాలజిస్ట్‌ను గానీ న్యూరోసర్జన్‌ను గానీ సంప్రదించండి. అవసరమైన పరీక్షలు చేసి, తగు చికిత్స సూచిస్తారు.” అని నిపుణులు చెబుతున్నారు. తల నొప్పి వచ్చి ఓ అరగంటలో తగ్గిపోయి మరే ఇతర లక్షణాలు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐతే.. తల నొప్పితోపాటు మెడ నొప్పి, తీవ్ర జ్వరం ఉంటే మీది ప్రమాదకరమైన తల నొప్పే అయ్యే అవకాశాలున్నాయి. ఇటువంటి సందర్భాల్లో వెంటనే వైద్యులను సంప్రదించాలి.