అసలే ఇది వర్షాకాలం. కాస్తంత ఆదమరిచి ఉంటే చాలు, మనపై దోమలు దాడి చేస్తుంటాయి. చాలా వరకు వ్యాధులు దోమల వల్లే వస్తుంటాయి. వాటిల్లో డెంగ్యూ ఒకటి. ఏడిస్ ఏజిప్టి అనే దోమ కుట్టడం వల్ల డెంగ్యూ వస్తుంది.
దోమలు కుట్టిన వెంటనే డెంగ్యూ లక్షణాలు కనిపించవు. అందుకు కొంత సమయం పడుతుంది. సాధారణంగా డెంగ్యూ వచ్చాక లక్షణాలు బయట పడేందుకు 4-10 రోజుల వరకు సమయం పడుతుంది. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే లక్షణాలు బయట పడేందుకు ఎక్కువ సమయం పడుతుంది.
డెంగ్యూ వచ్చిన వారిలో 106 డిగ్రీల ఫారెన్‌హీట్ జ్వరం ఉంటుంది. సడెన్‌గా జ్వరం తీవ్రత పెరుగుతుంది. తీవ్రమైన తలనొప్పి వస్తుంది. లింఫ్ గ్రంథులు వాపులకు గురవుతాయి. తీవ్రమైన కీళ్లు, కండరాల నొప్పులు వస్తాయి. చర్మంపై 2 నుంచి 5 రోజుల్లో దద్దుర్లు ఏర్పడతాయి.
ఇక డెంగ్యూ వచ్చిన వారిలో కొందరికి కడుపులో నొప్పి, వాంతులు అవడం, ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్త స్రావం అవడం, వాంతుల్లో రక్తం పడడం, మలంలో రక్తం పడడం, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. కనుక ఈ లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి.
డెంగ్యూ వచ్చిన వారికి ప్రత్యేకంగా మందులు అంటూ ఏమి ఉండవు. లక్షణాలకు అనుగుణంగా చికిత్స చేస్తారు. యాంటీ బయోటిక్స్ ఇవ్వడంతోపాటు జ్వరం, ఒళ్లు నొప్పులు, ఇతర లక్షణాలు తగ్గేందుకు డాక్టర్లు మందులను ఇస్తారు. ఈ క్రమంలో సరైన సమయంలో చికిత్స తీసుకుంటే త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.
డెంగ్యూ వచ్చిన వారికి రోజూ ప్లేట్‌లెట్ల పరీక్షలు చేస్తారు. ప్లేట్ లెట్ల సంఖ్య వరుసగా రెండు రోజులు పెరిగితే అప్పుడు వ్యాధి తగ్గుతున్నట్లు లెక్క. దీంతో బాధితులను డిశ్చార్జి చేస్తారు. అయితే ప్లేట్‌లెట్ల సంఖ్య పెరగాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, నట్స్, విత్తనాలను బాగా తినాలి. అలాగే రోజుకు రెండు సార్లు పావు టీస్పూన్ చొప్పున బొప్పాయి ఆకుల రసం తాగాలి. కివీ పండ్లను తినాలి. ఇవి ప్లేట్‌లెట్లను బాగా పెంచుతాయి.
ఎవరికైనా ఒకరికి ఇంట్లో డెంగ్యూ వస్తే అందరికీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇది అంటు వ్యాధి కాదు. కానీ ఒకరిని కుట్టిన దోమలు, ఇంకొకరిని కచ్చితంగా కుట్టేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక ఇంట్లో ఎవరికైనా డెంగ్యూ వస్తే వెంటనే ఇతరులకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దోమలను తరిమేయాలి. ఇంటి చుట్టు, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఎల్లప్పుడూ పరిశుభ్రమైన ఆహారం, నీరు తాగాలి. నీటిని మరిగించి తాగితే ఇంకా మంచిది. అలాగే ఆహారాలను తినడానికి ముందు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధమైన జాగ్రత్తలను పాటిస్తే డెంగ్యూ రాకుండా జాగ్రత్త పడవచ్చు.