mythology

మీకు కుంభీపాక న‌రకం గురించి తెలుసా..? ఇంకా ఎన్ని న‌ర‌కాలు ఉంటాయంటే..?

నరకం.. మానవుడు భయపడే లోకం. కర్మ సిద్ధాంతం నమ్మే వారికి ఇదొక భయానక లోకం. ఇక్కడకిపోతే చాలు వారు చేసిన కర్మలను బట్టి రకరకాల శిక్షలు విధిస్తాడు యముడు. భూలోకంలో మనుషులు తమ క్షణిక సుఖాల కోసం అనేక దుష్కర్మలను చేస్తారు. ఈ దుష్కర్మల ఫలితంగా మనిషికిమృత్యువు తరువాత భోగదేహం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ భోగదేహం రెండు రకాలు. ఒకటి- సూక్ష్మదేహం. ఇది మనిషి ఆచరించిన సత్కర్మల ఫలితంగా కలిగే సుఖాలను అనుభవించడానికి స్వర్గాది ఊర్ద్వ లోకాలకు చేరుతుంది. రెండవది- యాతనా దేహం. ఇది మానవుడు చేసిన పాప ఫలాలను నానా విధాలుగా అనుభవించడానికి నరకాది లోకాలకు చేరుతుంది. మృత్యువు తరువాత వెంటనే కొత్త దేహం ధరించడం వీలుకాదు.

కొత్త దేహ ప్రాప్తికి ముందు జీవి మనోమయ ప్రాణమయ దేహం చేత, సుకృత, దుష్కృత సుఖ దుఃఖాల ఫలితాలను అనుభవించవలసి వస్తుంది. శ్రీ మద్భాగవతంలో యాతనా దేహం అనుభవించే వివిధ శిక్షలు, వాటిని అమలు చేసే 28 నరకాల గురించి వర్ణన ఉంది. వాటిలో కొన్నిటిని గురించి సంక్షిప్త వివరణ. తామిస్ర నరకం: పరుల ధనం అపహరించడం, పరస్త్రీ, పర పుత్ర హరణం వలన ఈ నరకం పొందుతారు. ఇక్కడ అంధకార బంధురాన పడేసి కర్రలతో బాదుతారు. అంధతామిస్ర నరకం: మోసగించి స్త్రీలను, ధనాన్ని పొందేవారు, కళ్లు కనిపించని నరక లోకంలో నరికిన చెట్ల వలే పడి ఉంటారు. రౌరవం: ఇతర ప్రాణులను చంపి తన కుటుంబాన్ని పోషించుకునే వారికి నరకంలో రౌరువులు అనే జంతువులు పాముల కన్నా ఘోరంగా హింసిస్తాయి.

do you know about kumbhipaka narakam

మహారౌరవ: ఇతర ప్రాణులను బాధించి, హింసించి తన శరీరాన్ని పోషించుకునే వాడు ఈ నరకానికి చేరతాడు. పచ్చి మాంసం తినే రౌరువులు వీరిని హింసిస్తాయి. కుంభీపాక నరకం: సజీవంగా ఉన్న పశుపక్ష్యాదులను చంపి వాటి మాంసాన్ని తిన్న వాడు ఈ నరకాన్ని పొందుతాడు. ఇక్కడ సలసల కాగే నూనెలో పడవేసి హింసిస్తారు. కాలసూత్ర నరకం: తల్లిదండ్రులకు, సద్బ్రాహ్మణులకు, వేదానికి ద్రోహం తలపెట్టిన వారు ఈ నరకలోకాన్ని పొందుతారు. రాగి నేల కలిగి, నెత్తిన నిప్పులు చెరిగే సూర్యుడు వీరిని మాడ్చి వేస్తుంటాడు. అసిపత్ర వనం: ఆపద సమయాల్లో కాక ఇతర సమయాల్లో వేదాలను ధిక్కరించిన వారు ఈ నరకాన్ని పొందుతారు. ఇటువంటి వారిని ఈ నరక లోకంలో గొడ్డును బాదినట్టు బాదుతూ, సర్వాంగములను కత్తులతో కోసి తగిన శిక్షలను అమలు చేస్తారు.

సూకర ముఖము: దండించ దగని వారిని దండించిన రాజులను ఈ నరక లోకంలో చెరకు గడల వలే గానుగలలో పెట్టి తిప్పుతారు. అంధకూపము: నల్లులు మున్నగు వాటిని చంపిన వారిని ఈ నరక లోకంలో పాములు, దోమలు, చీమలు హింసిస్తాయి. క్రిమి భోజనం: అతిథులకు, అభాగ్యతులకు అన్నం పెట్టక తన పొట్ట నింపుకొనే వాడు ఈ నరకంలో పడతాడు. ఇక్కడ క్రిములతో నిండిన లక్ష యోజనముల కుండలో విసిరేయ బడతాడు. ఇలా అనేక రకాల శిక్షలు నరకలోకంలో వేస్తారు. కాబట్టి భూమి మీద బ్రతికనంత కాలం సత్యం, ధర్మం పాటిస్తే ఈ బాధలు ఉండవు.

Admin

Recent Posts