పాండవులు అజ్ఞాత వాసకాలంలో మత్స్యదేశంలో ఉన్నారు. విరాటుడు ఆ దేశం రాజు. ఆయన భార్య సుదేష్ణ. ఆమె తమ్ముడు సింహ బలుడు . కీచక దేశం వాడు గాబట్టి కీచకుడు అని వ్యవహారం. అతడు సేనాపతిగా రాజ్యరక్షణ చేస్తూ ఉంటాడు. ఆ రాజ్యం కీచక బల సంరక్షితం అని ప్రసిద్ధి. అతడు మరణించిన తర్వాతే ఆ రాజ్యం బలహీనపడింది అని కౌరవులు ఆ రాజ్యం దక్షిణ ఉత్తర దిశలలో ఉన్న గోసంపదను అపహరిస్తారు. సైరంధ్రీ వృత్తిలో ఉన్న మాలినిని (ద్రౌపదిని) చూచి కీచకుడు కామమోహితుడౌతాడు. అక్క సుదేష్ణతో ద్రౌపదిని తన దగ్గరకు పంపమని ప్రాధేయపడతాడు.
ద్రౌపదిని నడిదారిలో అందరూ చూస్తుండగా కీచకుడు బలాత్కరించబోతాడు. ద్రౌపది తన భర్తలు ఐదు మంది గంధర్వులు తనను నిత్యమూ సంరక్షిస్తూ ఉంటారనీ, వాళ్ల చేతుల్లో నీకు చావు తప్పదు అనీ చెప్పినా కీచకుడు వినడు. అతని సోదరి అతని ఒత్తిడికి తలొగ్గి తల నొప్పిగా ఉంది మా తమ్ముడి దగ్గర మద్యం ఉంది తెమ్మని మాలిని (ద్రౌపది)కి చెబుతుంది. దీంతో ద్రౌపదికి సుదేష్ణ అంతరార్థం అవగతం అవుతుంది. ఇక ఇది దారి కాదని అనుకొని వలలుడికి( భీముడికి) ఈ విషయం చెప్తుంది. వారు ఒక పథకం పన్నుతారు. కీచకుణ్ణి నర్తనశాలకు రాత్రి వేళకు రమ్మని చెబుతుంది.
కామమద మోహితుడైన కీచకుడు సింగారించుకొని నర్తనశాల చేరుతాడు. అప్పటికే అక్కడ భీముడు మాలిని వేషంలో ఉంటాడు. తరువాత అసలు విషయం తెలుసుకున్న కీచకుడు భీముడితో పోరాడుతాడు. ఇద్దరూ మహాబలశాలురూ పోరాడుతారు. హోరాహోరీ పోరాటం జరుగుతుంది. భీముడు కీచకున్ని ఆకారం గుర్తు పట్టలేనట్టు చంపి, అతడి పొట్టలో కాలుచేతులు దూర్చి మాంసపు ముద్దగా చేసేస్తాడు. ద్రౌపది మీద చెయ్యివేసినందుకు కీచకుడు సరైన మూల్యమే చెల్లించుకుంటాడు. భీముడి చేతిలో హతమవుతాడు. ఎంత బలం బలగం ఉన్నా కామవశుడై దుర్గతి పాలైన వాడు కీచకుడు. ఇతడి సోదరులు ఇతడి కళేబరాన్ని ఊరేగింపుగా శ్మశానానికి తీసుకుపోతూ ద్రౌపదినీ ఆ శవవాహనంలో బంధిస్తారు. వాళ్లను కూడా భీముడు మట్టి కరిపిస్తాడు.