Lord Kubera : కుబేరుడు ధనానికి, సంపదకు, సకల ఐశ్యర్యాలకు అధిపతి. ఆయన్ను పూజిస్తే వాటిని ఇస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకే లక్ష్మీదేవితోపాటు కుబేరుని విగ్రహాలను, చిత్రపటాలను కూడా చాలా మంది పూజిస్తారు. అయితే నిజానికి మీకు తెలుసా..? కుబేరుడు అంతకు ముందు జన్మలో దొంగ అట. అవును, మీరు విన్నది నిజమే. శివపురాణంలో దీని గురించి చెప్పబడింది. గత జన్మలో దొంగగా ఉన్న కుబేరుడు ఆ తరువాతి జన్మలో దేవుడిగా మారడం నిజంగా విచిత్రమే. అందుకు గల అసలు కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కుబేరుడు పూర్వ జన్మలో చాలా పేద వాడు. అతని పేరు గున్నిధి. ఒకానొక దశలో తినేందుకు తిండి కూడా అతనికి లభించదు. దీంతో అతను దొంగగా మారతాడు. అయితే ఓ సారి ఒక ప్రదేశంలో ఉన్న శివాలయంలో పెద్ద ఎత్తున బంగారు నగలు, రత్నాలు, ఇతర ఆభరణాలు ఉండడాన్ని గున్నిధి చూస్తాడు. దీంతో వెంటనే ఆ నగలను దొంగిలించాలనుకుంటాడు. ఆ క్రమంలోనే అతను ఆలయంలోకి ప్రవేశించగానే అప్పుడే పెద్ద ఎత్తున గాలి వీస్తుంది. దీంతో ఆలయంలో శివలింగం ఎదుట ఉన్న దీపం ఆరిపోతుంది.
దీపం ఆరిపోవడాన్ని గమనించిన గున్నిధి దాన్ని వెలిగించేందుకు యత్నిస్తాడు. అయితే ఎంత వెలిగించినా ఆ దీపం వెలగదు. అలా అతను చాలా సార్లు ప్రయత్నిస్తాడు. ప్రయత్నించినప్పుడల్లా విఫలమవుతూనే ఉంటాడు. దీంతో విసిగిపోయిన గున్నిధి తన చొక్కాను తీసి మంట పెట్టి దాంతో దీపం వెలిగిస్తాడు. అప్పుడు దీపం వెలుగుతుంది. దీనికి గాను శివుడు సంతోషించి గున్నిధి ఎదుట ప్రత్యక్షమై అతన్ని గణాల్లో ఒక అధిపతిగా చేస్తాడు. దీంతో అతను తరువాతి జన్మ నుంచి కుబేరుడిగా మారి సంపదకు రక్షకుడిగా ఉంటాడు.
అయితే నిజానికి కుబేరుడి వద్ద ఉండే ధనం ఆయనది కాదు, ఆయన దానికి రక్షణ మాత్రమే కల్పిస్తాడు. అందుకే చాలా వరకు ఆలయాల బయటే కుబేరుని విగ్రహాలు ఉంటాయి. కానీ లోపల అవి ఉండవు. అయినప్పటికీ ఆయన ధనానికి అధిపతి కనుక ఆయన్ను పూజిస్తే ఆర్థిక సమస్యల నుంచి బయట పడేస్తాడు. ఇక కుబేరుని కథ నుంచి మనం తెలుసుకోవల్సింది ఏమిటంటే.. శివ లింగం ఎదుట ఎవరైనా దీపం పెడితే వారి ఆర్థిక సమస్యలన్నీ పోతాయట. ముఖ్యంగా ఆ పనిని సాయంత్రం పూట చేయాలట. అలా దీపం వెలిగించే క్రమంలో ఓం నమశ్శివాయ అనే మంత్రం జపించాలి. దీంతో సమస్యలు తొలగిపోతాయట.