శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. సృష్టి, స్థితి, లయ కారకుల్లో లయానికి ముఖ్యుడైన శివుడికి తెలియకుండా ఏ జీవీ మరణించలేదని, శివుడి ఆజ్ఞ లభించాకే యముడు ప్రాణాలు తీసుకెళ్లేందుకు వస్తాడనే నేపథ్యంలో ఆ మాటను చెప్పారు. అయితే మనిషి మరణించడానికి ముందు అతనికి కొన్ని మృత్యు సూచనలు పంపబడతాయట. వాటిని కనిపెడితే తనకు మరణం ఇంకా ఎన్ని రోజుల్లో వస్తుందో తెలుసుకోవచ్చట. సాక్షాత్తూ శివుడే ఈ విషయం గురించి పార్వతికి చెప్పాడట. దీన్ని గురించి శివ పురాణంలోనూ ఉందని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో మనిషి మరణించడానికి ముందు అతనికి తెలిసే సూచనలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఎవరైనా వ్యక్తికి అతని ప్రతిబింబం నూనె, నీరు లేదా అద్దంలో కనిపించడం లేదంటే అతను మరో 6 నెలల్లో చనిపోతాడని తెలుసుకోవాలి. ఎవరికైతే నోరు, చెవులు, కళ్లు, నాలుక పనిచేయకుండా పోతాయో వారు కూడా మరో 6 నెలల్లో చనిపోతారట. వాటిని మృత్యువుకు సూచనలుగా భావించాలట. ఎవరైనా వ్యక్తి శరీరం ఉన్నట్టుండి తెలుపు లేదా పసుపు రంగులోకి మారుతూ శరీరంపై ఎరుపు రంగు మచ్చలు వస్తుంటే వారు 6 నెలల్లోగా చనిపోతారట. గొంతు, నాలుక వంటివి మాటి మాటికీ పొడిగా మారుతుంటే వారు త్వరలో చనిపోయే అవకాశాలు ఉంటాయట.
నొప్పి కారణంగా ఎడమ చేతిని మాటి మాటికీ వెనక్కి తీసుకుంటున్నా, దాంతో నాలుక పొడిగా మారుతున్నా అలాంటి వారు ఒక నెలలో చనిపోతారట. సూర్యుడు లేదా చంద్రున్ని చూసినప్పుడు వారి చుట్టూ ఎరుపు రంగులో రింగ్ లాంటిది ఏదైనా ఎవరికైనా కనిపిస్తే అలాంటి వారికి 15 రోజుల్లో మరణం సంభవిస్తుందట. నక్షత్రాలు, చంద్రున్ని అసలు చూడలేని వారు, లేదంటే వాటి స్థానంలో నల్లని కాంతిని చూసే వారికి మరణం అత్యంత సమీపంలో ఉందని తెలుసుకోవాలి. నీలి రంగులో ఉండే ఈగలు ఎవరినైనా చుట్టు ముడుతుంటే వారికి మరణం మరో నెలలో సంభవిస్తుందట.
రాబందు, కాకి లేదా పావురం ఎవరి తలపైనైనా కూర్చుంటే వారికి త్వరలో మరణం సంభవిస్తుందట. ఎవరైనా తన నీడను తల లేకుండా చూస్తే వారు కూడా త్వరలో చనిపోతారట. ఎవరికైనా చూపు పూర్తిగా పోయినా లేదా మంటను సరిగ్గా చూడలేకపోయినా వారికి కూడా త్వరలో మరణం కలుగుతుందట. పొలారిస్ అని పిలవబడే నార్త్ స్టార్ లేదా సూర్యున్ని ఎవరైనా చూడలేకపోయినా, రాత్రి పూట ఇంద్ర ధనుస్సు కనిపిస్తున్నా వారికి కచ్చితంగా త్వరలో మరణం వస్తుందట.