మనకు అందుబాటులో అనేక రకాల డైట్ ప్లాన్‌లు ఉన్నాయి. వీటి వల్ల ముఖ్యంగా అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి సమస్యలను తగ్గించుకోవచ్చని అనేక మంది ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరమాచినేని డైట్ అని ఓ సరికొత్త డైట్ ప్లాన్‌ను తెరపైకి తీసుకొచ్చారు. అయితే దీనిపై డాక్టర్లు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఈ డైట్ సరికాదని విమర్శిస్తున్నారు. దీంతో డ్యాష్ డైట్ (DASH diet) పేరిట మరో కొత్త డైట్‌ను డాక్టర్లు ప్రవేశపెట్టారు. మరి ఈ డైట్ ఏంటో, దాన్ని ఎలా చేయాలో, అందులో ఏమేం తినాలో, దాని వల్ల ఏమేం ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా. డ్యాష్ డైట్.. దీనికి పూర్తి పేరు.. DASH (Dietary Approaches to Stop Hypertension).. హైబీపీ ఉన్నవారి కోసం ప్రత్యేకంగా ఈ డైట్‌ను తయారు చేశారు. అయితే కేవలం బీపీ మాత్రమే కాకుండా ఈ డైట్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని, హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయని, బరువు తగ్గుతారని చెబుతున్నారు.
ఇక దీంతోపాటు డయాబెటిస్ నుంచి కూడా ఈ డైట్ ఉపశమనం కలిగిస్తుందని డాక్టర్లు అంటున్నారు. మన శరీరంలో మెదడు, అంతర్గత అవయవాలు, వెంట్రుకలు, చర్మం ఇలా అనేక భాగాలకు అవసరమైన కాల్షియం, ప్రోటీన్లు, ఫైబర్ ఈ డైట్ ద్వారా అందుతాయి. దీంతో శరీరానికి సంపూర్ణ పోషణ అందుతుంది. ఈ డైట్‌లో పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, ప్రోటీన్లు, డైరీ ఉత్పత్తులను లిమిట్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే తినే ఆహారాల్లో ఉప్పును తక్కువగా తీసుకోవాలి. రోజుకు 2 లీటర్ల నీటిని తాగాలి. రోజుకు 5 సార్లు తినాలి. ఒకసారి తింటే 216 గ్రాముల లోపు ఆహారాన్ని తినాలి. రోజూ తీసుకునే ఆహారం ద్వారా వచ్చే క్యాలరీలు 2000 నుంచి 2500 మధ్య ఉండాలి. వారంలో 5 సార్లు తీపి పదార్థాలు (తేనె, జామ్ మాత్రమే) తినవచ్చు. తృణ ధాన్యాలు, నట్స్, బీన్స్, మాంసం (చికెన్, చేపలు, రొయ్యలు), కూరగాయలు తినాలి.
సోడా, ఆల్కహాల్ తీసుకోరాదు. పొగ తాగరాదు. రోజుకు 8 సార్లు స్నాక్స్ తీసుకోవచ్చు. ఆకలి ఉంటేనే తినాలి. రోజుకు 2 నుంచి 3 టీ స్పూన్ల ఉప్పును మాత్రమే వాడాలి. గోధుమ బ్రెడ్‌ను రోజువారీ ఆహారంలో తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు, ఊరగాయ పచ్చళ్లు, పాస్ట్రీ, కేన్డ్ ఫిష్, మటన్ తినరాదు. గోధుమ బ్రెడ్ ప్యాకెట్ 1 (చిన్నది), అర కప్పు పాస్తా, అరకప్పు గంజి తాగాలి. ఇలా 7 సార్లకు మించకుండా తాగవచ్చు. చాయిస్ మీ ఇష్టం. 1 పండు (ఏదైనా), 1/4 కప్పు డ్రై ఫ్రూట్స్, 1/2 కప్పు జ్యూస్. ఇలా రోజుకు 5 సార్లకు మించకుండా తాగవచ్చు. చాయిస్ మీ ఇష్టం. అర కప్పు ఉడకబెట్టిన కూరగాయలు. 5 సార్లకు మించకుండా తాగవచ్చు. చాయిస్ మీదే. 50 గ్రాముల చీజ్, 0.15 లీటర్ల పాలు. 2-3 సార్లకు మించకుండా తాగవచ్చు. వారంలో 40 గ్రాముల వరకు సీడ్స్, నట్స్ తినాలి. ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్. 3 సార్లకు మించకుండా తాగవచ్చు. తేనె ఒక టీస్పూన్ లేదా ఒక టీస్పూన్ జామ్. వారానికి 5 సార్లకు మించకుండా తాగవచ్చు. నీరు, గ్రీన్ టీ, జ్యూస్‌లు రోజుకు 2 లీటర్ల వరకు తాగాలి. చేపలు, కోడిగుడ్లు, చికెన్ రోజుకు 200 గ్రాముల వరకు తినొచ్చు.
జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, చిప్స్, మద్యం, ప్రాసెస్ చేయబడిన ఆహారం, మటన్, బీఫ్, క్యాండీలు, కుకీలు, ఇతర స్వీట్లు, సోడా వంటి ఆహారాలను ఈ డైట్‌లో ఉండగా తీసుకోరాదు. పైన చెప్పిన ఆహారాల్లో తినకూడని ఆహారాలను పక్కన పెట్టి తినాల్సిన ఆహారాల్లో పైన చెప్పిన మోతాదులో వాటిని తినాలి. కాకపోతే రోజు వారీ ఆహారంలో అన్ని పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. కానీ మోతాదును మించరాదు. అలాగే తినాల్సిన ఆహారం ఎంత తిన్నా దాంతో వచ్చే క్యాలరీలు 2000 నుంచి 2500 మధ్య మాత్రమే ఉండాలి. ఇలా డ్యాష్ డైట్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది డ్యాష్ డైట్‌ను ఫాలో చేస్తున్నారు. దీంతో అధిక బరువు, మధుమేహం, హై బీపీ, గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. దీంతోపాటు మన శరీరానికి కావల్సిన కీలక పోషకాలు అన్నీ ఈ డైట్ ద్వారా మనకు లభిస్తాయట. దీంతో శరీరానికి సంపూర్ణ పోషణ అందుతుందని డాక్టర్లు అంటున్నారు. మిగిలిన అనేక రకాల డైట్స్ కన్నా ఈ డ్యాష్ డైట్ ఎంతో సేఫ్ అని అంటున్నారు.