Ravanasura : రామాయణానికి సంబంధించి చాలా సినిమాలు ఇప్పటికే వచ్చాయి. అలాగే రామాయణాన్ని చదివి కూడా చాలా మంది ఎన్నో విషయాలని తెలుసుకుంటూ ఉంటారు. రామ, లక్ష్మణ, భరత, శత్రుజ్ఞులు, హనుమంతుడితోపాటు ఎంతో మంది రామాయణంలో ఉన్నారు. రావణాసురుడు కూడా రామాయణంలో ఎంతో ముఖ్యమైన వాడు. రావణుడికి పది తలలు ఉంటాయి. రావణుడికి పది తలలు ఎందుకు ఉంటాయి, అసలు రావణుడికి పది తలలు ఉండడానికి కారణం ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం.
రావణుడికి పది తలలు ఉండడంపై వివిధ రామాయణ గాథల్లో రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. రావణుడు తపశ్శాలి, బలిశాలి. ఋషుల శాప ప్రభావం కారణంగా వైకుంఠ ద్వార పాలకులైన జయ, విజయలు త్రేతా యుగంలో రావణుడిగా, కుంభకర్ణుడిగా పుట్టారు. విచిత్ర రామాయణం ప్రకారం చూసినట్లయితే విశ్వవసు ఒక రోజు దాంపత్య సుఖాన్ని అనుభవించాలని తన భార్య దగ్గరికి వెళ్తాడు. ఆమె 11 సార్లు రుతిమతి అయినట్లు విశ్వవసు తెలుసుకుంటాడు.
ఆమె ద్వారా 11 మంది పుత్రులని పొందాలని భావిస్తాడు. కానీ ఆమె కేవలం ఇద్దరు పుత్రులని మాత్రమే కావాలని కోరుకుంటుంది. దీంతో అతను 10 తలలు ఉన్న రావణుడిని, 11వ వాడిగా కుంభకర్ణుడిని ఇచ్చినట్లు విచిత్ర రామాయణం ప్రకారం తెలుస్తోంది. అలాగే విష్ణుమూర్తి నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశ్యపుడిని సంహరిస్తాడు.
ఆ సమయంలో అకస్మాత్తుగా పుట్టి 20 గోళ్ళతో నన్ను ఒక్కడిని చంపడం కూడా ఓ పౌరుషమేనా అని హిరణ్యకశ్యపుడు ఆక్షేపిస్తాడట. తర్వాత జన్మలో శ్రీహరి నీకు 10 తలలు, 20 చేతులు ప్రసాదించి, మానవుడిగా అవతరించి సంహరిస్తానని విష్ణుమూర్తి చెప్పినట్లు ఒక కథ ఉంది. వాల్మీకి రామాయణంలో చూసుకుంటే ఇటువంటి వాటి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. కామరూప విద్యతోనే పది తలలు ఏర్పడ్డాయని కొందరు అంటుంటారు. ఇలా రావణుడి 10 తలల వెనుక పలు కథలు ప్రచారంలో ఉన్నాయి.