Allam Pachadi : మనం వంటల తయారీలో ఉపయోగించే పదార్థాల్లో అల్లం ఒకటి. అల్లాన్ని ఉపయోగించని వంటగది ఉండదనే చెప్పవచ్చు. వంటల్లో అల్లాన్ని ఉపయోగించడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అల్లం అనేక ఔషధ గుణాలను, ఆరోగ్య ప్రయోజనాలను దాగి ఉంది. అల్లాన్ని వాడడం వల్ల డయేరియా తగ్గుతుంది. వికారం, వాంతులు తగ్గుతాయి. శరీరంలో వాపులను, నొప్పులను తగ్గించడంలో, బరువు తగ్గడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో ఈ అల్లం మనకు ఎంతగానో సహాయపడుతుంది. వంటల్లో ఉపయోగించడంతో పాటు అల్లంతో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి తియ్య తియ్యగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లంతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
అల్లం – 3 ఇంచుల ముక్క, నానబెట్టిన చింతపండు – 50 గ్రా., బెల్లం తురుము – 50 గ్రా., ఎండుమిర్చి – 50 గ్రా., నూనె – రెండు టీ స్పూన్స్, కరివేపాకు – రెండు రెమ్మలు, ధనియాలు – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 1, కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 2, కరివేపాకు – ఒక రెమ్మ.
అల్లం పచ్చడి తయారీ విధానం..
ముందుగా అల్లంపై ఉండే పొట్టును తీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. వీటిని మాడిపోకుండా కలుపుతూ వేయించాలి. ఎండుమిర్చి కొద్దిగా రంగు మారిన తరువాత ధనియాలు, అల్లం ముక్కలు, మెంతులు, కరివేపాకు వేసి మరో మూడు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ దినుసులన్నీ చల్లారిన తరువాత జార్ లోకి తీసుకుని పొడిగా చేసుకోవాలి. తరువాత నానబెట్టిన చింతపండు, ఉప్పు, బెల్లం తురుము వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగిన తరువాత దీనిని ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసి కలుపుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అల్లం పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి గాజుసీసాలో గాలి, తడి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల నెలరోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ అల్లం పచ్చడిని మనం ఉదయం తయారు చేసుకునే అల్పాహారాలతో కూడా కలిపి తినవచ్చు. ఈ విధంగా అల్లంతో పచ్చడిని తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.