Aloo Khadi : మనం బంగాళాదుంపలను విరివిగా వాడుతూ ఉంటాము. వీటితో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుందని చెప్పవచ్చు. బంగాళాదుంపలతో తరుచూ చేసే వంటకాలే కాకుండా వీటితో మనం ఎంతో రుచిగా ఉండే మజ్జిగ పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంపలతో చేసే ఈ మజ్జిగ కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు మజ్జిగ పులుసును తయారు చేసుకుని తినవచ్చు. బంగాళాదుంపలతో ఎంతో రుచిగా ఉండే మజ్జిగ పులుసును ఎలా తయారు చేసుకోవాలి. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ మజ్జిగ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఉడికించి ముక్కలుగా కట్ చేసిన బంగాళాదుంపలు – 300 గ్రా., ఆవాలు -ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 5, తరిగిన పచ్చిమిర్చి – 5, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టీస్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, చిలికన పెరుగు – పావు లీటర్, నీళ్లు – పావు కప్పు, గరం మసాలా – ఒక టీస్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత.
ఆలూ మజ్జిగ పులుసు తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత బంగాళాదుంప ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత ఆమ్ చూర్ పొడి, కారం, ధనియాల పొడి, పసుపు వేసి కలపాలి. మసాలాలన్నీ చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పెరుగు వేసి కలపాలి. తరువాత నీళ్లు, గరం మసాలా, కొత్తిమీర వేసి కలపాలి. తరువాత వేయించిన బంగాళాదుంప ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. అంతే ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మజ్జిగ పులుసు తయారవుతుంది. దీనిని అన్నం, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలతో తరుచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా మజ్జిగ పులుసును కూడా తయారు చేసుకుని తినవచ్చు.