Aloo Ulli Karam Fry : బంగాళాదుంపలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది బంగాళాదుంపలతో చేసిన వంటకాలను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. బంగాళాదుంపలతో ఎక్కువగా చేసే వంటకాల్లో బంగాళాదుంప ఫ్రై కూడా ఒకటి. ఈ ఫ్రైను అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. తరచూ చేసే బంగాళాదుంప ఫ్రైను మరింత రుచిగా ఉల్లికారం వేసి కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసే ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది. ఉల్లికారం వేసి బంగాళాదుంప ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ ఉల్లికారం ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ముక్కలుగా తరిగిన బంగాళాదుంపలు – పావు కిలో, తరిగిన ఉల్లిపాయలు – 3, వెల్లుల్లి రెబ్బలు – 4, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఎండుమిర్చి – 2.
ఆలూ ఉల్లికారం ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత బంగాళాదుంప ముక్కలు వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై కలుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. బంగాళాదుంప ముక్కలు చక్కగా వేగిన తరువాత పసుపు, మిక్సీ పట్టుకున్న ఉల్లికారం వేసి కలపాలి. తరువాత వీటిని చిన్న మంటపై 10 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ ఉల్లికారం తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంపలతో ఈ విధంగా తయారు చేసిన ఉల్లికారాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. సాధారణంగా చేసే ఆలూ ఫ్రై కంటే ఈ విధంగా ఉల్లికారం వేసి చేసే ఫ్రై మరింత రుచిగా ఉంటుంది.