Aloo Vankaya Vepudu : ఆలూ వంకాయ ఫ్రై.. బంగాళాదుంపలు, వంకాయలు కలిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి అలాగే సైడ్ డిష్ గా తినడానికి ఈ ఫ్రై చాలా చక్కగా ఉంటుంది. మసాలా పొడి వేసి తయారు చేసే ఈ ఫ్రై ఇంట్లో అందరికి నచ్చుతుందని చెప్పవచ్చు. అలాగే ఈఫ్రైను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆలూ, వంకాయలను కలిపి కమ్మటి ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. ఇందులో వేసే మసాలాను తయారు చేసుకోవడానికి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ వంకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
వంకాయలు – పావు కిలో, బంగాళాదుంప – పెద్దది ఒకటి, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు -అర టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 8, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
మెంతులు – చిటికెడు, జీలకర్ర – అర టీ స్పూన్, ధనియాలు -ఒకటిన్నర టీ స్పూన్, మిరియాలు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
ఆలూ వంకాయ ఫ్రై తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపు, వంకాయలను ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత కట్ చేసుకున్న వంకాయ, బంగాళాదుంప ముక్కలు వేసి కలపాలి. తరువాత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి వేయించాలి. ఈ ముక్కలను మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించాలి. ముక్కలు వేగే లోపు కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలు వేసి దోరగా వేయించాలి.
తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. ముక్కలు ఎర్రగా వేగిన తరువాత ఇందులో పసుపు, కారం,కరివేపాకు వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ వంకాయ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన ఆలూ వంకాయ ప్రైను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.