Amla Candy : ఉసిరికాయ‌ల‌ను ఇలా నిల్వ చేస్తే.. ఏడాదిపాటు తిన‌వ‌చ్చు.. ఎంతో ఆరోగ్య‌క‌రం..

Amla Candy : ఉసిరికాయ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల విటమిన్స్, మిన‌రల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబ‌ర్ తో పాటు అనేక ఇత‌ర పోష‌కాలు కూడా ఉంటాయి. ఉసిరికాయ‌లు మ‌న ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే ఉసిరికాయ‌లు మ‌న‌కు సంవ‌త్స‌ర‌మంతా ల‌భించ‌వు. క‌నుక వీటిని ఎండ‌బెట్టి క్యాండీలుగా చేసి మార్కెట్ లో అమ్ముతూ ఉంటారు. ఈ క్యాండీల‌ను తిన‌డం వ‌ల్ల సంవ‌త్స‌ర‌మంతా మ‌నం ఉసిరికాయ‌ల వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

అయితే మార్కెట్ లో అమ్మే ఆమ్లా క్యాండీలు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండ‌డానికి వాటిలో ఫ్రిజ‌ర్వేటివ్స్ ను క‌లుపుతూ ఉంటారు. ఇలా ఫ్రిజ‌ర్వేటివ్స్ క‌లిపిన ఆమ్లా క్యాండీల‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. ఎటువంటి ఫ్రిజ‌ర్వేటివ్స్ క‌ల‌ప‌కుండా ఈ ఆమ్లా క్యాండీల‌ను మ‌నం ఇంట్లోనే చాలాసుల‌భంగా త‌యారు చేసుకుని సంవ‌త్స‌ర‌మంతా నిల్వ చేసుకోవ‌చ్చు. రుచిగా, సుల‌భంగా ఉసిరికాయ‌ల‌తో క్యాండీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Amla Candy recipe in telugu very healthy and tasty
Amla Candy

ఆమ్లా క్యాండీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెద్ద ఉసిరికాయ‌లు – అర కిలో, పంచ‌దార – పావు కిలో, నిమ్మ‌కాయ‌లు – 2.

ఆమ్లా క్యండీ త‌యారీ విధానం..

ముందుగా ఒక ఉసిరికాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అవి మునిగే వ‌ర‌కు నీటిని పోసి 10 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి. త‌రువాత వీటిని జ‌ల్లి గంటెలోకి తీసుకుని వ‌డ‌కట్టి నీరంతా పోయేలా 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత వీటిలో ఉండే గింజ‌ల‌ను తీసేసి ముక్క‌లుగా చేసుకోవాలి. ఈ ఉసిరికాయ‌ల‌ను చేతితో వ‌త్తితే చాలా సుల‌భంగా ముక్క‌లుగా అవుతాయి. ఇలా త‌యారు చేసుకున్న ఉసిరికాయ ముక్క‌ల‌ను గాజు గిన్నెలో లేదా సెరామిక్ గిన్నెలో వేసి పంచ‌దార ,నిమ్మ‌ర‌సం వేసి క‌ల‌పాలి.

త‌రువాత ఈ ముక్క‌ల‌పై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ఒక రోజంతా అలాగే ఉంచాలి. పంచ‌దార క‌రిగి నీరులా మారుతుంది. క‌నుక వీటిని పూర్తిగానీరు లేకుండా వ‌డ‌క‌ట్టి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న ముక్క‌ల‌ను రెండు రోజుల పాటు ఎండ‌లో ఉంచి ఎండ‌బెట్టాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌కు మిరియాల పొడి, ఉప్పు, శొంఠి పొడి క‌లిపి గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. తియ్య‌గా కావాల‌నుకునే వారు ఈ ముక్క‌ల‌ను పంచ‌దార పొడిని క‌లిపి నిల్వ చేసుకోవాలి. ఈ ముక్క‌ల‌ను బ‌య‌ట ఉంచ‌డం వ‌ల్ల మూడు నెల‌ల పాటు తాజాగా ఉంటాయి. ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల సంవ‌త్స‌ర‌మంతా తాజాగా ఉంటాయి.

ఈ విధంగా ఉసిరికాయ‌ల‌తో స‌హ‌జ సిద్దంగా క్యాండీల‌ను త‌యారు చేసుకుని సంవ‌త్స‌ర‌మంతా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఉసిరికాయ‌ల‌తో ఈ విధంగా త‌యారు చేసుకున్న క్యాండీల‌ను నోట్లో వేసుకుని చ‌ప్ప‌రించ‌డం వ‌ల్ల నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. అలాగే వీటిని తిన‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. కంటి చూపు మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జీర్ణ‌క్రియ మెరుగుపడుతుంది. చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. ఈ విధంగా ఆమ్లా క్యాండీల‌ను ఇంట్లోనే త‌యారు చేసుకుని ఉప‌యోగించ‌డం వ‌ల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts