Andhra Ulavacharu : ఉల‌వ‌చారును ఒక్క‌సారి ఈ స్టైల్ లో చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Andhra Ulavacharu : ఉల‌వ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్ ప్ర‌యోజ‌నాల‌తో పాటు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను పొంద‌వ‌చ్చు. ఉలవ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. కాలేయం మ‌రియు మూత్ర‌పిండాలు చ‌క్క‌గా పని చేస్తాయి. ఈ విధంగా ఉల‌వ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉల‌వ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఉల‌వ‌ల చారు కూడా ఒక‌టి. ఉల‌వ‌ల చారు చాలా రుచిగా ఉంటుంది. ఈ చారును ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉంటారు. రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ ఉల‌వ‌ల చారును ఆంధ్రా స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రా ఉల‌వ‌చారు త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

ఉల‌వ‌లు – అర‌కిలో, నీళ్లు – ఒక‌టిన్న‌ర లీట‌ర్, నాన‌బెట్టిన చింత‌పండు – 25 గ్రా., నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 6, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు- త‌గినంత‌.

Andhra Ulavacharu recipe in telugu tastes better with rice
Andhra Ulavacharu

ఆంధ్రా ఉల‌వ‌చారు త‌యారీ విధానం..

ముందుగా ఉల‌వ‌ల‌ను శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత నీటిని పోసి రాత్రంతా నాన‌బెట్టాలి. తరువాత ఈ ఉలవ‌ల‌ను నీటితో స‌హా కుక్క‌ర్ లో మూత పెట్టాలి. ఈ ఉల‌వ‌ల‌ను చిన్న మంట‌పై గంట పాటు ఉడికించాలి. త‌రువాత మూత తీసి ఉల‌వ‌ల‌ను నీటిని వేరు చేసుకోవాలి. ఉల‌వ‌ల‌ను ఉడికించిన నీటితోనే మ‌నం చారు చేస్తాము క‌నుక మిగిలిన ఈ ఉల‌వ‌ల‌ను గుగ్గిళ్లుగా చేసుకుని తిన‌వ‌చ్చు. ఉల‌వ‌ల‌ను ఉడికించిన నీటిని గిన్నెలోకి తీసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ప‌సుపు వేసి క‌ల‌పాలి.

త‌రువాత ఉల‌వ‌లు ఉడికించిన నీటిని పోసి అర‌గంట పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత చింత‌పండు ర‌సం, ఉప్పు వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో 10 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉల‌వ‌ల చారు త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఉల‌వ‌ల‌తో చారును త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

D

Recent Posts