Nutmeg For Beauty : అందంగా కనబడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందుకు ఎంతో ఖర్చు చూస్తూ ఉంటారు కూడా. కానీ మనలో చాలా మంది ముఖంపై మచ్చలు, ముడతలు, మొటిమలు వంటి రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాతావరణ కాలుష్యం, ఎండలో తిరగడం, ఒత్తిడి, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ కారణాల చేత మనం అందవిహీనంగా మారుతూ ఉంటాము. ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి మార్కెట్ లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్ ను అధిక ధరలకు కొనుగోలు మరీ వాడుతూ ఉంటాము.
అయితే అధిక ధరలకు లభించే క్రీములను, పేస్ వాస్ లను వాడే అవసరం లేకుండా కేవలం మన ఇంట్లో ఉండే జాజికాయను ఉపయోగించి మనం మన ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు. జాజికాయను మనం మసాలా దినుసులుగా మాత్రమే మనం ఉపయోగిస్తాము. కానీ సౌందర్య సాధనంగా కూడా జాజికాయ మనకు సహాయపడుతుంది. ముఖాన్ని అందంగా మార్చడంలో మనకు జాజికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకోవడానికి జాజికాయను ఏవిధంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ఒక గిన్నెలో అర టీ స్పూన్ జాజికాయ పొడి, అర టీ స్పూన్ చందనం పొడిని తీసుకోవాలి. తరువాత ఇందులో కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ పేస్ట్ లాగా చేసుకోవాలి.
తరువాత ఈ పేస్ట్ ను ముఖానికి రాసుకుని నెమ్మదిగా మర్దనా చేయాలి. తరువాత ఈ మిశ్రమం ఆరిన తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి. అలాగే ముఖ చర్మంపై మృతకణాలు పేరుకుపోయిన వారు ఒక గిన్నెలో అర టీ స్పూన్ తేనెను తీసుకోవాలి. ఇందులో పావు టీ స్పూన్ జాజికాయ పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట పాటు అలాగే ఉండాలి. తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
అలాగే ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ పాలు, పావు టీ స్పూన్ జాజికాయ పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట పాటు అలాగే ఉండాలి. అరగంట తరువాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే ముడతలు తొలగిపోయి ముఖం అందంగా మారుతుంది. ఈ విధంగా జాజికాయ పొడిని వాడి మనం చాలా సులభంగా ముఖాన్ని అందంగా, కాంతివంతంగా, యవ్వనంగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాలను వాడడం వల్ల మనం మంచి ఫలితాలు పొందవచ్చు.