Annavaram Prasadam Recipe : అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ మహాత్యం గురించి మనందరికి తెలిసిందే. అలాగే ఈ ఆలయంలో ఇచ్చే గోధుమ రవ్వ ప్రసాదం గురించి తెలియని వారుండరనే చెప్పవచ్చు. ఈ ప్రసాదం రుచి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఈ ప్రసాదం ఉంటుంది. ఈ అన్నవరం ప్రసాదాన్ని అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చని మనలో చాలా మందికి తెలిసి ఉండదు. ఈ ప్రసాదాన్ని మనం అదే రుచితో ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అన్నవరం ప్రసాదాన్ని ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అన్నవరం ప్రసాదం తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎర్ర గోధుమ రవ్వ – ఒక కప్పు, జాజికాయ ముక్క – ఒక చిన్న ముక్క ( శనగ గింజత పరిమాణం), పటిక – పావు టీ స్పూన్, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, కుంకుమ పువ్వు – రెండు చిటికెలు, నీళ్లు – 3 కప్పులు, పంచదార – ఒక కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, నెయ్యి – 1/3 కప్పు.
అన్నవరం ప్రసాదం తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఎర్ర గోధుమ రవ్వను వేసి వేయించాలి. దీనిని 10 నిమిషాల పాటు చిన్న మంటపై కలుపుతూ వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు రోట్లో జాజికాయ, కుంకుమ పువ్వు, పటిక, యాలకుల పొడి వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత అడుగు మందంగా ఉండే కళాయిని తీసుకుని అందులో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత వేయించిన రవ్వను వేసి కలపాలి. దీనిపైమూతను ఉంచి మెత్తగా ఉడికించాలి. తరువాత పంచదార వేసి కలపాలి. దీనిని దగ్గర పడే వరకు మరో 10 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత బెల్లం తురుము వేసి ఉడికించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత నెయ్యి వేసి కలపకుండా మూత ఉంచి 5 నిమిషాల పాటు చిన్న మంటపై అలాగే ఉంచాలి. 5 నిమిషాల తరువాత దంచిపెట్టుకున్న పొడిని వేసి అంతా కలిసేలా బాగా కలపాలి.
తరువాత దీనిపై మూతను ఉంచి అదే చిన్న మంటపై మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రసాదం వేడిగా ఉండగానే విస్తరాకులో కట్టి ఉంచడం వల్ల విస్తరాకుకు ఉండే పరిమళం ప్రసాదానికి పట్టి ప్రసాదం మరింత రుచిగా తయారవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల కమ్మటి రుచిని కలిగి ఉండే అన్నవరం ప్రసాదాన్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పండుగలకు, ఇంట్లో పూజలు జరిగినప్పుడు ఇలా అన్నవరం ప్రసాదాన్ని చేసి ప్రసాదంగా ఇవ్వవచ్చు.