Atukula Vadalu : మనం అటుకులను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అటుకులు కూడా వివిధ రకాల పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అటుకులను తినడం వల్ల కూడా మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. అటుకులతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. ఎక్కువగా అటుకుల మిక్చర్, పోహా వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా అటుకులతో మనం ఎంతో రుచిగా ఉండే వడలను తయారు చేసుకోవచ్చు. అటుకుల వడలు పైన కరకరలాడుతూ లోపల మెత్తగా ఉంటాయి. ఈ వడలను చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే అటుకుల వడలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల వడలు తయారీకి కావల్సిన పదార్థాలు..
అటుకులు – 3 కప్పులు, పెరుగు – ఒక కప్పు, బియ్యం పిండి – రెండు టేబుల్ స్పూన్స్, గోధుమపిండి – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – పావు కప్పు, తరిగిన పుదీనా – పావు కప్పు, తరిగిన కరివేపాకు – రెండు రెమ్మలు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
అటుకుల వడలు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో అటుకులను తీసుకుని రెండు నుండి మూడుసార్లు శుభ్రంగా కడగాలి. తరువాత వాటిని రెండు నిమిషాల పాటు కదిలించకుండా ఉంచాలి. తరువాత అటుకులను ఒక జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో అర కప్పు పెరుగు, బియ్యం పిండి, గోధుమపిండి, ఉప్పు వేసి కలపాలి. తరువాత మరో అర కప్పు పెరుగు వేసి మెత్తగా కలుపుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా అటుకుల మిశ్రమాన్ని తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఒక్కో ఉండను తీసుకుంటూ వడల ఆకారంలో వత్తుకుంటూ నూనెలో వేసుకోవాలి.
ఈ వడలు కొద్దిగా కాలిన తరువాత గంటెతో అటూ ఇటూ కదుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. వడలు ఎర్రగా కాలిన తరువాత వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల వడలు తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో, పల్లి చట్నీతో, టమాట చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్స్ గా వీటిని తయారు చేసుకుని తినవచ్చు. ఈ అటుకుల వడలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.