Gas Trouble : మనల్ని వేధించే జీర్ణ సంబంధిత సమస్యల్లో గ్యాస్ట్రిక్ సమస్య కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో ఈ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. కడుపులో మంట, ఉబ్బరం, అజీర్తి, ఎక్కిళ్లు, గుండెలో మంట, వికారం వంటి వాటిని గ్యాస్ట్రిక్ సమస్య యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు. మనం తీసుకునే ఆహారం, మారిన జీవన విధానం, ఒత్తిడి, ఆందోళన వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. గ్యాస్ట్రిక్ సమస్య చిన్నదే అయినప్పటికి దీనిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం భవిష్యత్తులో అనేక రకాల ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం చాలా సులభంగా గ్యాస్ట్రిక్ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మన వంటింట్లో ఉండే పదార్థాలను తగ్గించి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజ సిద్దంగా మనం ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడే వారు సోంపు టీ ని తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య నుండి మంచి ఉపశమనాన్ని పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. ఒక కప్పు నీటిలో ఒక టీ స్పూన్ సోంపు గింజలను వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా సోంపు టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి లక్షణాల నుండి ఉపశమనం కలుగుతుంది. ఆకలి శక్తి పెరుగుతుంది. అలాగే ఎండిన చామంతి పూలతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యల నుండి వేగంగా ఉపశమనాన్ని పొందవచ్చు.
నీటిలో ఎండిన చామంతి పూలను వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి తాగాలి. ఇలా రోజూ ఉదయం పరగడుపున అలాగే రాత్రి పడుకునే ముందు తాగాలి. చామంతి టీ ని తాగడం వల్ల గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను వేగంగా తగ్గించుకోవచ్చు. అదే విధంగా గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు చక్కెర కలపని అలాగే కొవ్వు లేని ఒక గ్లాస్ చల్లటి పాలను తాగడం వల్ల సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. పాలల్లో ఉండే క్యాల్షియం ఆమ్లత్వాన్ని తగ్గించి క్షారాత్వాన్ని పెంచుతుంది. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యల నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. అదే విధంగా మజ్జిగలో జీలకర్ర పొడి, నల్ల ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల కూడా గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి.
అలాగే ఒక టీ స్పూన్ పుదీనా రసాన్ని లేదా ఒక కప్పు పుదీనా టీ ని తాగడం వల్ల కూడా మనం చక్కటి ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంలో మనకు నిమ్మకాయ కూడా ఎంతో సహాయపడుతుంది. నిమ్మకాయ టీ ని తయారు చేసుకుని తాగినా లేదా నిమ్మకాయ నీటిలో జీలకర్ర పొడి, నల్ల ఉప్పు కలిపి తాగినా కూడా మనం గ్యాస్ట్రిక్ సమస్యల నుండి వేగంగా ఉపశమనాన్ని పొందవచ్చు. వీటితో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే వారు అల్లం, వాము, జీలకర్ర, తులసి వంటి పదార్థాలతో విడివిడిగా కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఉపశమనాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా గ్యాస్ట్రిక్ సమస్యలను చాలా సులభంగా తగ్గించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.