Baby Corn Masala : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో బేబీ కార్న్ ఒకటి. అయితే ఇది ధర ఎక్కువగా ఉంటుంది. కనుక దీన్ని చాలా మంది తినరు. అయితే ధర ఎక్కువ ఉన్నా సరే.. బేబీ కార్న్‌ను తరచూ తినాలి. ఎందుకంటే.. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా బేబీ కార్న్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. కనుక బేబీ కార్న్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే దీన్ని ఎలా వండాలో చాలా మందికి తెలియదు. బేబీ కార్న్‌తో మసాలా కూరను తయారు చేసి తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బేబీ కార్న్ మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
బేబీ కార్న్ – 200 గ్రాములు, ఉల్లి, టమాటా ముక్కలు – 2 కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు, పచ్చి మిర్చి – 2, టమాటా ప్యూరీ – రెండు టీస్పూన్లు, పసుపు – పావు టీస్పూన్, ఆవాలు – పావు టీస్పూన్, ధనియాల పొడి – అర టీస్పూన్, గరం మసాలా పొడి – పావు టీస్పూన్, కొత్తిమీర తురుము – పావు కప్పు, ఉప్పు, నూనె – తగినంత.
బేబీ కార్న్ మసాలా కూరను తయారు చేసే విధానం..
బేబీ కార్న్‌ను పాన్‌లో కొద్దిపాటి నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా జతచేయాలి. ఆ తరువాత ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి మూత పెట్టాలి. 2 నిమిషాల తరువాత టమాటాలు, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేసి మగ్గించాలి. ఆ తరువాత బేబీ కార్న్, టమాటా ప్యూరీ వేసి కలపాలి. ధనియాల పొడి, మూడు టీస్పూన్ల నీళ్లు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. కాసేపయ్యాక గరం మసాలా వేసి కలిపి దించేయాలి. పైన కొత్తిమీర తురుము చల్లితే బేబీ కార్న్ మసాలా రెడీ అవుతుంది. దీన్ని చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా బేబీ కార్న్‌తో మనం అనేక పోషకాలను పొందవచ్చు.