Grape Juice : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో ద్రాక్ష పండ్లు కూడా ఒకటి. వీటిని చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. మనకు నలుపు, ఆకుపచ్చ రంగుల్లో ద్రాక్షలు లభిస్తూ ఉంటాయి. వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ద్రాక్ష పండ్లలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. తరచూ ద్రాక్ష పండ్లను తినడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు రాకుండా ఉంటాయి. మైగ్రేన్ తలనొప్పిని, మలబద్దకాన్ని తగ్గించడంలో ద్రాక్ష పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ద్రాక్ష పండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
మూత్రపిండాల సంబంధిత వ్యాధులు రాకుండా చేయడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, కంటి చూపును మొరుగుపరచడంలో కూడా ద్రాక్ష పండ్లు సహాయపడతాయి. ద్రాక్ష పండ్లతో చల్లచల్లగా ఎంతో రుచిగా ఉండే జ్యూస్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ద్రాక్ష పండ్లను నేరుగా తినలేని వారు ఇలా జ్యూస్ గా చేసుకుని తాగడం వల్ల కూడా ద్రాక్ష పండ్ల వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ద్రాక్ష పండ్ల జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక కప్పు ద్రాక్ష పండ్లను తీసుకుని నీళ్లల్లో వేసి బాగా కడిగి జార్ లో వేసుకోవాలి. ఇందులో తగినంత పంచదారను, తగినన్ని ఐస్ క్యూబ్స్ ను వేసి మిక్సీ పట్టుకోవాలి. దీనిని వడకట్టి గ్లాస్ లో పోసుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ద్రాక్ష పండ్ల రసం తయారవుతుంది. ఇలా ద్రాక్ష పండ్లతో జ్యూస్ ను చేసుకుని తాగడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. మెదడు పని తీరును మెరుగుపరచడంలో, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలో ఉండే నొప్పులను, వాపులను తగ్గించడంలో ఈ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.