Beans Fry : వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ వంటి వాటి తయారీలో ఉపయోగించే కూరగాయల్లో బీన్స్ కూడా ఒకటి. బీన్స్ ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇతర కూరగాయల వలె బీన్స్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బీన్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ బీన్స్ తో మనం అనేక రకాల ఇతర వంటకాలను కూడా తయారు చేసుకోవచ్చు. బీన్స్ తో చేసే చేసుకోదగిన వంటకాల్లో బీన్స్ ఫ్రై కూడా ఒకటి. చక్కగా వండాలే కానీ ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా, సులభంగా, ఆరోగ్యానికి మేలు చేసేలా బీన్స్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బీన్స్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బీన్స్ – అరకిలో, పచ్చి కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, పుట్నాల పప్పు పొడి – ఒక టీ స్పూన్.
బీన్స్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా బీన్స్ ను 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల బీన్స్ లో ఉండే పోషకాలు నశించకుండా ఉంటాయి. అలాగే జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి బరకగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత ఉడికించిన బీన్స్, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి. వీటిని 5 నిమిషాల పాటు వేయించిన తరువాత కారం, మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమం వేసి కలిపి రెండు నిమిషాల పాటు వేయించాలి.
తరువాత పుట్నాల పప్పు పొడి వేసి కలిపి నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీన్స్ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో కలిపి తినవచ్చు. అలాగే పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా తినవచ్చు. బీన్స్ ను తినడం ఇష్టలేని వారు కూడా ఈ ఫ్రైను విడిచి పెట్టకుండా తింటారు.