Beer : రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య గత కొద్ది రోజుల నుంచి యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. అయితే ఈ కారణంగా బీర్ల ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో బార్లీ ఎక్కువగా పండుతుంది. దాన్ని బీర్ల తయారీలో ఉపయోగిస్తారు. కనుక త్వరలో బీర్ల ధరలు పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రష్యా బ్రాండెడ్ మద్యం వెరైటీలను అమెరికా, కెనడాలు నిషేధించాయి. దీంతో పలు దేశాల్లో రష్యా బ్రాండ్ మద్యం వోడ్కా ధర భారీగా పెరిగింది. ఇక త్వరలో బీర్లపై కూడా ఈ ప్రభావం పడుతుందని అంటున్నారు.
రష్యా ప్రపంచంలోనే బార్లీ ఉత్పత్తిని చేస్తున్న దేశాల్లో రెండో స్థానంలో ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా మాల్ట్ ఉత్పత్తిదారుల్లో ఉక్రెయిన్ 4వ స్థానంలో ఉంది. దీంతో ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా బీర్లతోపాటు ఇతర మద్యం ధరలు కూడా పెరుగుతాయని అంటున్నారు.
అయితే మన దేశంలోనూ బార్లీ ఎక్కువగానే ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ తయారయ్యే బీర్ల కోసం బ్రూవరీలు దేశీయంగా పండిన బార్లీనే వినియోగిస్తున్నాయి. కానీ అంతర్జాతీయంగా బార్లీకి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్న దృష్ట్యా.. మన దేశంలోనూ బార్లీపై ఆ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇక ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజుల వరకు వేచి చూడాల్సిందేనని అంటున్నారు.
అయితే బీర్ల తయారీ సంస్థలు చెబుతున్న ప్రకారం అయితే రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కారణంగా బార్లీపై కచ్చితంగా ప్రభావం పడుతుందని.. దీంతో బీర్ల ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. ఇక దీనిపై స్పష్టత రావల్సి ఉంది.