Nerves : మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో నరాల బలహీనత సమస్య కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా బాధపడే వారు మనలో చాలా మంది ఉన్నారు. నరాల బలహీనత కారణంగా మనం వివిధ రకాల అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి మందులు వాడుతూ ఉంటారు. మందులను వాడడంతో పాటు సహజసిద్ద ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా మనం ఈ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అసలు నరాల బలహీనత సమస్య ఎందుకు వస్తుంది… ఎవరిలో ఎక్కువగా వస్తుంది… ఈ సమస్య నుండి బయటపడాలంటే మనం తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో నరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి మెదడు నుండి శరీర అవయవాలకు శరీర అవయవాల నుండి మెదడుకు సంకేతాలను చేరవేస్తూ ఉంటాయి.
మనం ఏదైనా వేడి వస్తువును చేత్తో తాకగానే నరాలు ఆ సమాచారాన్ని వెంటనే చేతుల నుండి మెదడుకు చేరవేస్తాయి. మెదడు చేయిని దూరంగా జరపమని పంపించే సంకేతాన్ని నరాలు మరలా మెదడు నుండి చేతులకు చేరవేస్తాయి. ఈ విధంగా నరాలు సమచారాన్ని చేరవేస్తూ ఉంటాయి. నరాల కణాల యొక్క ఆయుర్దాయం జీవితకాలమని నిపుణులు చెబుతున్నారు. వెన్నుపాములో ఉండే నరాలు తెగిపోతే మరలా అతకవు. దీంతో మన చేతులు, కాళ్లు పడిపోతాయి. అదే చేతులు, కాళ్లల్లో ఉండే నరాలు 3 ఎమ్ ఎమ్ వరకు తెగితే మరలా అతుకుంటాయి. నరాల కణాలు ఒక్కసారి పుడితే మనం మరణించే వరకు అవే కణాలు ఉంటాయి. అయితే వివిధ కారణాల చేత మన శరీరంలో ఉండే నరాలు దెబ్బతింటాయి. నరాల్లో మంటలు వస్తూ ఉంటాయి.
ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడే వారిలో నరాలు ఎక్కువగా దెబ్బతింటాయి. నరాలపై మైలిన్ షీట్ అనే పొర ఉంటుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారిలో ఈ షీట్ ఎక్కువగా దెబ్బ తింటుంది. ఈ షీట్ దెబ్బతినడం వల్ల నరాల్లో మంటలు వస్తూ ఉంటాయి. అలాగే కొందరిలో చేతులు, కాళ్లు వణుకుతూ ఉంటాయి. దీనినే నరాల బలహీనత అంటారు. ఈ సమస్య ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారిలో, ధూమపానం చేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. నరాలు సరిగ్గా పని చేయాలంటే మన శరీరానికి బి కాంప్లెక్స్ విటమిన్స్ అవసరమవుతాయి. అయితే ఆల్కహాల్, ధూమపానం చేయడం వల్ల శరీరంలో చేరిన మలినాలను తొలగించడానికి కాలేయానికి బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువగా అవసరమవుతాయి. ఇతరుల కంటే ఆల్కాహాల్ తీసుకునే వారికి మూడింతల బి కాంప్లెక్స్ విటమిన్స్ అవసరమవుతాయి.
శరీరానికి తగినన్ని బి కాంప్లెక్స్ విటమిన్స్ ను అందించకపోవడం వల్ల ఆల్కహాల్ తీసుకునే వారిలో నరాల బలహీనత సమస్య ఎక్కువగా వస్తుంది. అలాగే విటమిన్ డి, ఇ విటమిన్స్ శరీరానికి సరిగ్గా అందకపోయినా కూడా నరాల బలహీనత సమస్య వస్తుంది. మనల్పి ఎంతగానో వేధించే ఈ నరాల బలహీనత సమస్య తగ్గాలంటే మనం చక్కటి ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఈ సమస్యతో బాధపడే వారు తవుడును ఎక్కువగా తీసుకోవాలి. తవుడులో బి కాంప్లెక్స్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ తవుడును నెల రోజుల పాటు తీసుకోవడం వల్ల నరాలు బలంగా తయారవుతాయి. అలాగే పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుండి మనం బయటపడవచ్చు. పుట్టగొడుగుల్లో విటమిన్ బి 12 ఎక్కువగా ఉంటుంది.
కనుక వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా పాలకూరను తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి తగినంత విటమిన్ బి 12 లభిస్తుంది. శరీరానికి తగినంత విటమిన్ బి 12 అందడం వల్ల నరాల బలహీనత సమస్య తగ్గుతుంది. ఈ సమస్యతో బాధపడే వారు నరాలు బలంగా తయారవ్వడానికి మొలకెత్తిన గింజలను, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ను తప్పకుండా తీసుకోవాలి. అలాగే విటమిన్ డి కొరకు రోజూ కొద్ది సమయం ఎండలో కూర్చోవాలి. ఈ విధంగా బి కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్ ఇ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా నరాల బలహీనత సమస్య నుండి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.