Bendakaya Pakodi : బెండకాయలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బెండకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో ఎక్కువగా వేపుడు, పులుసు, కూర వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు బెండకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే బెండకాయ పకోడిని కూడా తయారు చేసుకోవచ్చు. బెండకాయ పకోడి చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటుంది. ఫంక్షన్ లల్లో, కర్రీ పాయింట్ లలో ఇది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. క్రిస్పీగా, రుచిగా బెండకాయ పకోడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
బెండకాయలు – పావుకిలో, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీస్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 10, కరివేపాకు – 2 రెమ్మలు, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, నానబెట్టిన జీడిపప్పు – గుప్పెడు, శనగపిండి – 2 టీ స్పూన్స్, బియ్యంపిండి – 2 టీ స్పూన్స్, మైదాపిండి -ఒక టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్, ఫుడ్ కలర్ – చిటికెడు, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
బెండకాయ పకోడి తయారీ విధానం..
ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి తొడిమెలను తీసేసి మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి కలుపుకోవాలి. బెండకాయలల్లో ఉండే తేమతోనే కలుపుకోవాలి. అవసరమైతే తప్ప నీటిని చల్లుకోకూడదు. ఇలా కలుపుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. వీటినిమధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ పకోడి తయారవుతుంది. దీనిని పప్పు, సాంబార్ తో సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ బెండకాయ పకోడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.