Bitter Gourd Curry : కాకరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో ఇలా అనేక రకాలుగా ఇవి మనకు మేలు చేస్తాయి. వీటిని ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉంటారు. కాకరకాయతో చేసుకోదగిన వాటిల్లో కాకరకాయ కూర కూడా ఒకటి. ఈ కాకరకాయ కూరను చేదు లేకుండా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వుల పొడి – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన కాకరకాయలు – పావుకిలో, తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, బెల్లం తురుము – ఒక టేబుల్ స్పూన్.
కాకరకాయ కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలను వేసి ఎర్రగా కరకరలాడే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత వేయించిన కాకరకాయ ముక్కలు వేసి కలపాలి.
తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు, చింతపండు రసం వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత బెల్లం తురుము, నువ్వుల పొడి వేసి కలపాలి. బెల్లం కరిగిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కూర తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా కాకరకాయలతో ఎంతో రుచిగా ఉండే కూరను తయారు చేసుకుని తినవచ్చు. కాకరకాయ అంటే ఇష్టంలేని వారు కూడా ఈ కూరను ఇష్టంగా తింటారు.