Biyyam Pindi Atlu : బియ్యం పిండితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బియ్యం పిండితో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఈ బియ్యం పిండితో చిరుతిళ్లు, పిండి వంటకాలే కాకుండా అట్లను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఈ అట్లను ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకోవచ్చు. బియ్యం పిండితో పాతకాలంలో ఎక్కువగా ఇలా అట్లను తయారు చేసుకుని తినేవారు. ఈ అట్లను రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా ప్రస్తుత కాలానికి తగినట్టుగా తయారు చేసుకుని తినవచ్చు. కేవలం 15 నిమిషాల్లో అయ్యే ఈ బియ్యం పిండి అట్లను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం పిండి అట్లు తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యంపిండి – ఒకటిన్నర కప్పు, బొంబాయి రవ్వ – అర కప్పు, ఉప్పు – తగినంత, నీళ్లు – 3 కప్పులు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, క్యారెట్ తురుము – అర కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బియ్యం పిండి అట్లు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యంపిండిని తీసుకోవాలి. తరువాత అందులో రవ్వ వేసి కలపాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. తరువాత ఈ పిండిలో మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. పెనం బాగా వేడయ్యాక పిండిని కలుపుకుంటూ తగిన పరిమాణంలో పిండిని తీసుకుని పెనం మీద పలుచగా అట్టు లాగా వేసుకోవాలి. ఇది కొద్దిగా కాలిన తరువాత దీనిపై నూనె వేసుకుని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా క్రిస్పీగా ఉండే బియ్యంపిండి అట్లు తయారవుతాయి. వీటిని టమాట చట్నీ, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉదయం పూట సమయం లేని వారు ఇలా ఇన్ స్టాంట్ గా బియ్యపిండితో అట్లను వేసుకుని అల్ఫాహారంగా తినవచ్చు. వీటిని అందరూ ఇష్టంగా తింటారు.