Boiling Eggs : కోడిగుడ్లు అంటే సహజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. కోడిగుడ్లను చాలా మంది రకరకాలుగా వండుకుని తింటారు. ఎగ్ రైస్, బాయిల్డ్ ఎగ్స్, కోడిగుడ్డు వేపుడు, టమాటా కూర.. ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఎలా చేసినా కూడా కోడిగుడ్లు ఎంతో రుచిగా ఉంటాయి. అయితే రోజుకో కోడిగుడ్డును తింటే పోషకాలను పొందవచ్చని, ఆరోగ్యంగా ఉండవచ్చని కూడా పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఈ క్రమంలో కోడిగుడ్డును రోజూ ఒకటి చొప్పున ఉడకబెట్టి తినాలని అంటుంటారు.
అయితే కోడిగుడ్లను ఉడకబెట్టే సమయంలో కొన్నిసార్లు గుడ్లు పగులుతుంటాయి. గుడ్లు పగిలి లోపల ఉన్న సొన అంతా బయటకు వస్తుంది. దీంతో అలాంటి గుడ్లను తినలేము. కానీ కింద తెలిపిన కొన్ని చిట్కాలను పాటించడం వల్ల కోడిగుడ్లు అలా పగలకుండా చూసుకోవచ్చు. వాటిని చాలా సులభంగా ఉడికించవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్లను ఉడకబెట్టేటప్పుడు ఆ నీటిలో కాస్త ఉప్పు వేస్తే చాలు. గుడ్లు పగలకుండా ఉంటాయి. పొట్టు కూడా సులభంగా వస్తుంది. అలాగే కోడిగుడ్లపై కాస్త నల్ల మిరియాల పొడిని కూడా చల్లవచ్చు. ఇలా చేసినా కూడా గుడ్లు పగలకుండా ఉంటాయి. ఇక కొందరు కోడిగుడ్లను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. వాటిని తీసిన వెంటనే ఉడికిస్తారు. ఇలా చేస్తే గుడ్లు పగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక గుడ్లను ఉడకబెట్టాలి అనుకునే వారు వాటిని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. ఫ్రిజ్‌లో పెట్టరాదు.
ఇక స్టవ్‌పై గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి కాస్త ఉప్పు వేసి నీళ్లను బాగా మరిగించాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులో గుడ్లు వేయాలి. అవి ఒకదానికొకటి టచ్ కాకుండా చూడాలి. తరువాత 10 నిమిషాలకు గుడ్లు బాగా ఉడుకుతాయి. వాటిని తీసి పొట్టు తీసుకోవచ్చు. దీంతో గుడ్లు పగలకుండా ఉంటాయి.
గుడ్లను ఉడకబెట్టే నీళ్లలో కాస్త వెనిగర్ వేసినా చాలు, గుడ్లు పగలకుండా బాగా ఉడుకుతాయి. మార్కెట్‌లో కోడిగుడ్లను ఉడకబెట్టే ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ పాత్రలు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా ట్రై చేయవచ్చు. ఇలా ఈ చిట్కాలను పాటించడం వల్ల కోడిగుడ్లు పగలకుండా ఉడుకుతాయి. పొట్టు కూడా సులభంగా వస్తుంది.