Bottle Gourd Onion Masala : మనకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అనేక రకాల కూరగాయల్లో సొరకాయలు కూడా ఒకటి. అయితే చాలా మంది వీటిని తినేందుకు అంతగా ఆసక్తిని చూపించరు. కొందరు మాత్రం సొరకాయలతో వివిధ రకాల వంటలను చేస్తుంటారు. సొరకాయ పప్పు, పచ్చడి, టమాటా కూర, పాయసం.. ఇలా చేస్తుంటారు. అయితే సొరకాయలతో మీరు ఎప్పుడైనా ఉల్లికారం కూరను చేశారా. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. సులభంగా చేయవచ్చు కూడా. సొరకాయలు అంటే ఇష్టం లేని వారు సైతం దీన్ని రుచి చూశారంటే ఒక పట్టు పడతారు. ఇక సొరకాయలతో ఉల్లికారం కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిముక్కలు (సన్నగా తరిగినవి) – 2 కప్పులు, ఎండు మిర్చి – 15, ధనియాలు – అర టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, ఆవాలు – 1 టీస్పూన్, సొరకాయ ముక్కలు – 4 కప్పులు, టమాటాలు – 2, బెల్లం తురుము – 2 టీస్పూన్లు, చింతపండు – నిమ్మకాయంత, మినప పప్పు – 2 టీస్పూన్లు, శనగ పప్పు – 4 టీస్పూన్లు, నూనె – అర కప్పు, కొత్తిమీర తురుము – అర కప్పు, ఉప్పు – 2 టీస్పూన్లు, పసుపు – అర టీస్పూన్, కరివేపాకు – 2 రెబ్బలు.
ముందుగా లేత సొరకాయ తీసుకుని తొక్కు తీసి చిన్న ముక్కలుగా కోయాలి. అందులోనే ఒక టీస్పూన్ ఉప్పు, పసుపు వేసి కలిపి పక్కన పెట్టాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి పప్పులన్నీ వేసి వేయించి తీయాలి. అదే బాణలిలో ఉల్లిముక్కలు కూడా వేసి వేయించి తీయాలి. తరువాత ఎండుమిర్చి కూడా వేయించి తీయాలి. ఇప్పుడు వేయించిన పప్పులు, ఉల్లిముక్కలు, బెల్లం తురుము, చింతపండు, ఎండు మిర్చి అన్నీ కలిపి ముద్దలా నూరి పక్కన ఉంచాలి. బాణలిలో మిగిలిన నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఉప్పు, పసుపు వేసి ఉంచిన సొరకాయ ముక్కల నీళ్లు పిండేసి వేసి, మూత పెట్టి సన్న సెగ మీద మగ్గనివ్వాలి. ముక్కలు ఉడికిన తరువాత నూరి ఉంచిన ఉల్లికారం వేసి కాసేపు వేయించాలి. తరువాత మూతపెట్టి సిమ్‌లోనే ఉడికించి దించే ముందు కొత్తిమీర తురుము చల్లాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే సొరకాయ ఉల్లికారం రెడీ అవుతుంది. దీన్ని అన్నంలో నెయ్యితో కలిపి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.