Bread Chaat : బ్రెడ్ తో మనం రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో బ్రెడ్ చాట్ కూడా ఒకటి. బ్రెడ్ తో చాట్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఈ చాట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చేసుకున్న వెంటనే తినేయాలి. దీనిని కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. పిల్లలతో పాటు పెద్దలు దీనిని ఇష్టంగా తింటారు. సాయంత్రం సమయంలో లైట్ గా స్నాక్స్ తినాలనుకునే వారికి ఈ చాట్ చాలా చక్కగా ఉంటుంది. బ్రెడ్ తో అప్పటికప్పుడు రుచిగా, కమ్మగా చాట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ చాట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 4 టేబుల్ స్పూన్స్, బ్రెడ్ స్లైసెస్ – 4, ఉడికించి మెత్తగా చేసిన బంగాళాదుంప – 1, బూందీ – అర కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, దానిమ్మ గింజలు – అర కప్పు, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, చాట్ మసాలా – అర టీ స్పూన్, ఉప్పు – కొద్దిగా, నిమ్మరసం – 2 టీ స్పూన్స్.
బ్రెడ్ చాట్ తయారీ విధానం..
ముందుగా బ్రెడ్ చుట్టూ నల్లగా ఉండే భాగాన్ని తీసేసి బ్రెడ్ ను ఒకే పరిమాణంలో క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బ్రెడ్ క్యూబ్స్ ను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి టాస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ చాట్ తయారవుతుంది. దీనిని బ్రౌన్ బ్రెడ్ తో తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు బ్రెడ్ తో చాట్ ను తయారు చేసుకుని తినవచ్చు.