Brinjal Cucumber Chutney : మనం వంటింట్లో అప్పటికప్పుడు ఎన్నో రకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. ఇలా సులభంగా, చాలా తక్కువ సమయంలో చేసుకోదగిన పచ్చళ్లల్లో వంకాయ దోసకాయ పచ్చడి కూడా ఒకటి. వంకాయలు, దోసకాయ కలిపి చేసే ఈ పచ్చడి తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడగక మానరు. ఈ పచ్చడిని అందరూ లొట్టలేసుకుంటూ తింటారనే చెప్పవచ్చు. ఈ పచ్చడిని తయారు చేయడం చాలా తేలిక. అలాగే ఎక్కువ సమయం కూడా పట్టదు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే వంకాయ దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ దోసకాయ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, పల్లీలు – పావు కప్పు, పచ్చిమిర్చి – 10లేదా తగినన్ని, తరిగిన వంకాయలు – 4, తరిగిన టమాటాలు – 3, చింతపండు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 10, తరిగిన దోసకాయ – 200 గ్రా..
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ.
వంకాయ దోసకాయ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, పల్లీలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని అదే కళాయిలో వంకాయ ముక్కలు,టమాట ముక్కలు, చింతపండు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలను బాగా మగ్గించాలి. వంకాయ ముక్కలు మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు జార్ లో వేయించిన పల్లీలు, పచ్చిమిర్చితో పాటు వేయించిన టమాటాలు, వంకాయలను కూడా వేసుకోవాలి. తరువాత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి.
తరువాత ఇదే జార్ లో దోసకాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు పదార్థాలు వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ దోసకాయ పచ్చడి తయారవుతుంది. వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి ఈ పచ్చడిని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.