Instant Tomato Curry : మన వంటింట్లో తప్పకుండా ఉండే కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. టమాటాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని మనం వంటల్లో విరివిగా వాడుతూ ఉంటాము. టమాటాలను ఉపయోగించి అనేక రకాలు కూరలను, పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటుగా కేవలం టమాటాలతో మనం టమాట కూరను కూడా తయారు చేస్తూ ఉంటాము. టమాట కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టంగా తినే వారు కూడా మనలో చాలా మంది ఉన్నారు. ఈ కూరను తయారు చేయడం కూడా చాలా సులభం. అప్పటికప్పుడు రుచిగా, కమ్మగా ఈ టమాట కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాట కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క, లవంగాలు – 3, యాలకులు – 2, జీలకర్ర – అర టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన టమాటాలు – పావుకిలో, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నువ్వుల పొడి – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
టమాట కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. అవసరమైతే కొద్దిగా నీటిని పోసి మరీ ఉడికించాలి. టమాట ముక్కలు ఉడికి కూర దగ్గర పడిన తరువాత నువ్వుల పొడి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే టమాట కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, ఉప్మా వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.