Tomatoes : బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి అద్బుతమైన ఫీట్‌ను సాధించాడు. స్వతహాగా గార్డెనర్ అయిన అతను ఎల్లప్పుడూ భిన్న రకాల మొక్కలను పెంచుతుంటాడు. ఈ క్రమంలోనే అతను పెంచిన ఓ టమాటా చెట్టుకు ఏకంగా 1269 టామాటాలు పండాయి. దీంతో అతని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు అయింది. వివరాల్లోకి వెళితే..
ఇంగ్లండ్‌లోని స్టాన్‌స్టీడ్ అబ్బాట్స్‌కు చెందిన డగ్లాస్ స్మిత్ అనే వ్యక్తి 2021 సెప్టెంబర్ నెలలో ఒక టమాటా చెట్టును పెంచాడు. అయితే దానికి తాజాగా 1269 టమాటాలు కాశాయి. దీంతో అతను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారిని సంప్రదించాడు. ఈ క్రమంలో వారు వివరాలు అన్నీ పరిశీలించి రికార్డును అతనికి అందజేశారు. అయితే గతంలో స్మిత్ ఒకే టమాటా చెట్టుకు 839 టమాటాలను పండించగా.. ఇప్పుడు 1269 టమాటాలను పండించి తన రికార్డును తానే బ్రేక్ చేశాడు.
కాగా తాను సాధించిన ఈ ఫీట్ గురించి స్మిత్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. ఇక గతంలోనూ ఇతను భారీ సైజ్‌లో ఉండే టమాటాను పండించి రికార్డులకెక్కాడు. ఇతను పండించిన ఒక టమాటా ఏకంగా 3.1 కిలోల బరువు తూగడం విశేషం. ఈ క్రమంలోనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.