Cyber Security : టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ మనకు అనేక సర్వీస్‌లను అందిస్తున్న విషయం విదితమే. జీమెయిల్, యూట్యూబ్, డ్రైవ్, మ్యాప్స్.. ఇలా మనకు అనేక రకాల సేవలను గూగుల్ అందిస్తోంది. అయితే గూగుల్‌కు చెందిన క్రోమ్ బ్రౌజర్‌ను చాలా మంది వాడుతుంటారు. దీన్ని కంప్యూటర్లు, ఫోన్లు, ట్యాబ్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాగే మొజిల్లా ఫైర్ ఫాక్స్ అనే బ్రౌజర్‌ను కూడా చాలా మందే వాడుతున్నారు. ఈ క్రమంలోనే గూగుల్ అకౌంట్లతోపాటు ఈ బ్రౌజర్లను వాడుతున్న వారికి ఐటీ సెక్యూరిటీ నిపుణులు పలు హెచ్చరికలు చేస్తున్నారు. అవేమిటంటే..
సాధారణంగా మనం అనేక రకాల వెబ్‌సైట్లను రోజూ సందర్శిస్తుంటాం. కొన్నింటిలో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేసి లాగిన్ అవుతుంటాం. అయితే అనేక రకాల సైట్లకు చెందిన యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లను మనం గుర్తు పెట్టుకోలేం కదా. కనుక వాటిని ఎక్కడో ఒక చోట భద్రంగా సేవ్ చేస్తాం. ఇలా సేవ్ చేసేందుకు క్రోమ్, ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్లు ప్రత్యేక ఫీచర్‌ను అందిస్తున్నాయి. యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లను ఆయా బ్రౌజర్‌లలో సేవ్ చేయవచ్చు. దీంతో ఆయా సైట్లలో లాగిన్ అయినప్పుడల్లా మనం మళ్లీ మళ్లీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేయాల్సిన పని ఉండదు. ఆటోమేటిగ్గా లాగిన్ అవగలుగుతాం.
అయితే ఇలా బ్రౌజర్‌లలో యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లను సేవ్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇలా సేవ్ చేసే లాగిన్ వివరాలు సురక్షితమే అయినప్పటికీ.. కొందరు హ్యాకర్లు ఎలాగైనా సరే వీటిని యాక్సెస్ చేయగలుగుతారని చెబుతున్నారు. కనుక బ్రౌజర్లలో లాగిన్ వివరాలను సేవ్ చేసేటప్పుడు దానికి ప్రొటెక్షన్‌గా జీమెయిల్ అకౌంట్ లేదా పిన్ ను సెట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో ఆ వివరాలు సురక్షితంగా ఉంటాయని అంటున్నారు.