Cabbage 65 : క్యాబేజిని కూడా మనం ఆమారంగా తీసుకుంటూ ఉంటాం. దీని వల్ల కూడా మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. కానీ చాలా మంది క్యాబేజ్ రుచి, వాసన కారణంగా దీనిని తినడానికి ఇష్టపడరు. క్యాబేజ్ తో వేపుడు, కూరలనే కాకుండా మనం ఇతర వంటకాలను కూడా తయారు చేసుకోవచ్చు. క్యాబేజ్ తో చేసుకోదగిన వాటిల్లో క్యాబేజ్ 65 కూడా ఒకటి. క్యాబేజ్ 65 ని కచ్చితంగా ఎవరైనా తినాల్సిందే. అంత రుచిగా క్యాబేజ్ 65 ఉంటుంది. కరకరలాడుతూ ఉండేలా రుచిగా ఈ క్యాబేజ్ 65 ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజ్ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
సన్నగా తరిగిన క్యాబేజ్ తరుగు – పావు కిలో, శనగపిండి – అర కప్పు, కార్న్ ఫ్లోర్ – పావు కప్పు, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, కరివేపాకు – కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి – 3.
క్యాబేజ్ 65 తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో క్యాబేజ్ తురుమును తీసుకోవాలి. తరువాత అందులో శనగపిండి, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి వేసి కలపాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, ఫుడ్ కలర్, ధనియాల పొడి వేసి 5 నిమిషాల పాటు బాగా కలపాలి. వీటిని కలిపేటప్పుడు 1 లేదా 2 టీ స్పూన్స్ కంటే ఎక్కువ నీటిని వేయకూడదు. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక క్యాబేజ్ మిశ్రమాన్ని పకోడీలలా వేసి వేయించాలి. దీనిని మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించి టిష్యూ పేపర్ ఉంచిన గిన్నెలోకి తీసుకోవాలి.
క్యాబేజ్ తురుమును వేయించిన తరువాత అదే నూనెలో కరివేపాకును, పచ్చిమిర్చిని వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రుచిగా, కరకరలాడుతూ ఉండే క్యాబేజ్ 65 తయారవుతుంది. దీనిని నేరుగా లేదా పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. క్యాబేజ్ ను తినడానికి ఇష్టపడని వారు కూడా ఈ క్యాబేజ్ 65 ని ఇష్టంగా తింటారు.