Marriage : పూర్వకాలం నుంచి మన పెద్దలు ఎన్నో ఆచారాలను, సంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వాటిని పాటించేవారు తక్కువయ్యారు. కానీ కొన్ని ఆచారాలు మాత్రం ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే స్త్రీ, పురుషుల పెళ్లిళ్ల విషయంలో అనేక నమ్మకాలను పాటించేవారు. స్త్రీ ఎల్లప్పుడూ తనకన్నా వయస్సులో ఎక్కువ ఉన్న పురుషులనే పెళ్లి చేసుకోవాలని.. తక్కువ వయస్సు ఉన్న పురుషులను చేసుకోరాదని.. అలా చేసుకుంటే అరిష్టం కలుగుతుందని చెబుతుంటారు. అయితే ఇలా చేసుకుంటే నిజంగానే అరిష్టం కలుగుతుందా.. అసలు దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వకాలంలో స్త్రీలు ఇళ్లకే పరిమితం అయ్యేవారు. కుటుంబ భారం, పోషణ, ఖర్చులు.. అన్నీ పురుషులే చూసుకునేవారు. అలాంటి సమయంలో పురుషుడు తనకన్నా వయస్సులో ఎక్కువ ఉన్న స్త్రీని పెళ్లి చేసుకుంటే అప్పుడు కుటుంబ భారం ఆమె మీద పడుతుంది. అది ఆ రోజుల్లో చాలా కష్టతరమైన విషయం. కనుక అప్పట్లో పురుషులు తమకన్నా వయస్సులో చిన్న వారైన స్త్రీలనే పెళ్లి చేసుకోవాలని నిబంధన పెట్టారు. దీంతో పురుషలపైనే కుటుంబ భారం పడుతుంది. ఇది ఇబ్బంది కలిగించదు. కనుక ఈ నిబంధన అప్పట్లో వచ్చింది.
ఇక స్త్రీ తనకన్నా వయస్సులో పెద్దదైతే ఆమెను ఓదార్చడం, బతిమాలడం అప్పట్లో అవమానంగా భావించేవారు. అలాగే భర్త కాళ్లకు భార్య మొక్కుతుంది. అలాంటి పరిస్థితిలో భార్య వయస్సు ఎక్కువగా ఉంటే అప్పుడు చిన్నవారికి మొక్కినట్లు అవుతుంది. ఇది అరిష్టం. కనుక పెళ్లి చేసుకునే పురుషులు తమకన్నా తక్కువ వయస్సు ఉన్న స్త్రీలనే పెళ్లి చేసుకునేవారు. దీంతో స్త్రీలు తాము చెప్పిన మాట వింటారని పురుషులు అనుకునేవారు. అలాగే కాళ్లకు మొక్కే విషయంలోనూ ఇబ్బంది ఉండేది కాదు. అందుకనే అప్పట్లో అలా పెళ్లి చేసుకునేవారు. అయితే అప్పట్లో ఇది చెల్లుబాటు అయింది. కానీ ఇప్పుడు పాటించాల్సిన అవసరం లేదు. అసలు ఒక స్త్రీ, పురుషుడు కలసి ఉండేందుకు వయస్సుతోనూ ఎలాంటి సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు. కనుక ఆరోగ్యకరమైన దాంపత్యం ఉన్నంత వరకు స్త్రీ, పురుషులు ఇలాంటి వయస్సు భేదాలు పట్టించుకోవాల్సిన పనిలేదు. అది అప్పట్లో ఉన్న ఆచారం. కానీ ఇప్పుడు పాటించాల్సిన అవసరం లేదు.