Cauliflower Nilva Pachadi : మనం క్యాలీప్లవర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటితో రకరకాల కూరలు, వేపుళ్లు తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. క్యాలీప్లవర్ తో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. అయితే తరుచూ క్యాలీప్లవర్ తో కూరలే కాకుండా మనం పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. క్యాలీప్లవర్ తో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇది చాలా కాలం పాటు నిల్వ కూడా ఉంటుంది. వేడి వేడి అన్నం, నెయ్యితో ఈ పచ్చడిని తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. క్యాలీప్లవర్ తో రుచిగా, కమ్మగా ఉండే నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాలీప్లవర్ నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాలీప్లవర్ – 300 గ్రా., నానబెట్టిన చింతపండు – 50 గ్రా., ఆవాలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్, మెంతులు – అర టేబుల్ స్పూన్, నూనె – ఒక కప్పు, ఎండుమిర్చి – 3, జీలకర్ర – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – పావు కప్పు, కరివేపాకు – ఒక రెమ్మ, కారం – అర కప్పు, ఉప్పు – 3 టేబుల్ స్పూన్స్.
క్యాలీప్లవర్ నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా క్యాలీప్లవర్ ను తీసుకుని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తరువాత క్యాలీప్లవర్ 300 గ్రాములు ఉండేలా చూసుకోవాలి. తరువాత క్యాలీప్లవర్ ను ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత వీటిపై వేడి వేడి నీటిని పోస్తూ బాగా కడగాలి. తరువాత ఈ ముక్కలను పూర్తిగా తడి పోయేలా ఆరబెట్టుకోవాలి. తరువాత కళాయిలో ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. వీటిని జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో నానబెట్టిన చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె కొద్దిగా వేడయ్యాక క్యాలీప్లవర్ ముక్కలను వేసి వేయించాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకున్న తరువాత అదే నూనెలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
ఇవి వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న చింతపండు వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ తాళింపును గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కారం, మిక్సీ పట్టుకున్న మెంతిపిండి వేసి కలపాలి. తరువాత వేయించిన క్యాలీప్లవర్ ముక్కలు వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మూత పెట్టి ఒక రోజంతా అలాగే ఉంచాలి. తరువాత ఈ పచ్చడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాలీప్లవర్ నిల్వ పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.