Chekodilu Recipe : మనకు బయట స్వీట్ షాపుల్లో లభించే చిరుతిళ్లల్లో చెకోడీలు కూడా ఒకటి. చెకోడీలు చాలా రుచిగా కరకరలాడుతూ ఉంటాయి. ఈ విధంగా చెకోడీలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చెకోడీలను తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. అంతగా శ్రమించాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా సలుభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. రుచిగా, కరకరలాడుతూ ఉండేలా చెకోడీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చెకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – 100 గ్రా., బియ్యం పిండి – 50 గ్రా., వాము – ఒక టేబుల్ స్పూన్, కారం – అర టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, వెన్న లేదా డాల్డా – ఒక టేబుల్ స్పూన్.
చెకోడీల తయారీ విధానం..
ముందుగా గిన్నెలో 125 ఎమ్ ఎల్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఉప్పు, బటర్, కారం, వాము వేసి కలపాలి. నీళ్లు మరిగిన తరువాత అందులో మైదాపిండి, బియ్యంపిండి వేసి అంతా కలిసేలా గంటెతో కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమం పూర్తిగా చల్లారే వరకు ఉంచాలి. పిండి చల్లారిన తరువాత చేత్తో బాగా కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని సన్నని పొడుగు తాడులా చేత్తో వత్తుకుని తరువాత చెకోడీలా చుట్టుకోవాలి. ఇలా చేయడం రాని వారు జంతికల గొట్టంలో పిండిని ఉంచి సన్నగా పొడుగ్గా తాడులాగా వత్తుకుని వాటితో చెకోడీలను చుట్టుకోవాలి.
ఇలా చెకోడీలన్నింటిని చుట్టుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తరువాత చెకోడీలను వేసి వేయించుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా కరకరలాడే వరకు వేయించుకుని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కరకరలాడుతూ స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే చెకోడీలు తయారవుతాయి. పిల్లలు వీటిని ఇష్టంగా తింటారు. వీటిని గాలి తగలకుండా నిలకవ చేసుకోవడం వల్ల చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. బయట లభించే చిరుతిళ్లకు బదులుగా ఇలా ఇంట్లోనే చెకోడీలను తయారు చేసుకుని తినవచ్చు.