Chicken Popcorn : చికెన్ అంటే మాంసాహార ప్రియులు చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. దీన్ని వారు ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్‌తో అనేక రకాల వంటలను చేసి తింటుంటారు. చికెన్ వేపుడు, బిర్యానీ, కూర.. ఇలా చేస్తుంటారు. అయితే చికెన్‌తో ఎంతో రుచికరమైన స్నాక్స్‌ను కూడా చేయవచ్చు. వాటిల్లో చికెన్ పాప్‌కార్న్ ఒకటి. దీన్ని తయారు చేసి సాయంత్రం సమయంలో తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. తయారు చేయడం కూడా సులభమే. చికెన్ పాప్ కార్న్‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ పాప్‌కార్న్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ ముక్కలు – పావు కిలో, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు, గుడ్డు – ఒకటి, బ్రెడ్ పొడి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి – పావు టీస్పూన్, కారం – 2 టీస్పూన్లు, గరం మసాలా – ఒక టీస్పూన్, నూనె – వేయించడానికి సరిపడా.
చికెన్ పాప్ కార్న్‌ను తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో కారం, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పొడి, ఉప్పు వేసి కలపాలి. చికెన్‌ను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. వీటి మీద కారం మిశ్రమం చల్లి ముక్కలకి పట్టేలా బాగా కలపాలి. తరువాత కార్న్‌ఫ్లోర్ కూడా వేసి కలపాలి. ఇప్పుడు విడిగా ఇంకో గిన్నెలో గుడ్డు తెల్లసొన, మరో గిన్నెలో బ్రెడ్ పొడి వేయాలి. ఒక్కో ముక్కని తెల్లసొనలో ముంచి బ్రెడ్ పొడిలో దొర్లించి తీయాలి. ఇలాగే అన్నీ చేయాలి. ముక్కలు బాగా కరకరలాడాలంటే మరోసారి గుడ్డసొనలో ముంచి బ్రెడ్ పొడి అద్దాలి. వీటిని పావు గంట పాటు పక్కన ఉంచాలి. తరువాత బాణలిలో నూనె వేసి కాగాక కొంచెం కొంచెంగా చికెన్ ముక్కలను వేసి వేయించి తీయాలి. దీంతో ఎంతో రుచికరమైన చికెన్ పాప్ కార్న్ రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. అందరూ ఇష్టంగా తింటారు.