Kandipappu Idli : కందిపప్పును సహజంగానే చాలా మంది పప్పు కూరల రూపంలో వండుతారు. వివిధ రకాల కూరగాయలు లేదా ఆకుకూరలతో పప్పు చేస్తారు. అలాగే కంది పచ్చడి కూడా చేస్తారు. ఇవన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే కందిపప్పుతో ఇడ్లీలను కూడా చేయవచ్చు. ఇవి సాధారణ ఇడ్లీల్లాగే ఉంటాయి. కానీ ఎంతో రుచిగా ఉంటాయి. పైగా వీటిని తింటే ప్రోటీన్లు కూడా లభిస్తాయి. కనుక ఇవి ఆరోగ్యకరమైన ఇడ్లీలని చెప్పవచ్చు. ఇక వీటిని తయారు చేయడం కూడా సులభమే. సాధారణ ఇడ్లీల్లాగే వీటిని చేయవచ్చు. ఈ క్రమంలోనే కందిపప్పు ఇడ్లీలను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కంది పప్పు ఇడ్లీల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – మూడు కప్పులు, కందిపప్పు – ఒకటిన్నర కప్పు, మినప పప్పు – అర కప్పు, ఉప్పు – తగినంత.
కందిపప్పు ఇడ్లీలను తయారు చేసే విధానం..
బియ్యం, మినప పప్పులను కలిపి ముందు రోజు కడిగి నానబెట్టాలి. అలాగే కందిపప్పును కూడా నానబెట్టుకోవాలి. కొన్ని గంటల తరువాత కందిపప్పును నీళ్లు లేకుండా రుబ్బుతూ కొంచెం మెదిగాక నీళ్లు పోసి బియ్యం, మినప పప్పు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత ఉప్పు వేసి కలిపి నానబెట్టాలి. దాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు పిండిని కలిపి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇడ్లీలోని పాత్రలలో పిండి ముద్దలను వేయాలి. తరువాత మూత పెట్టి ఇడ్లీలను ఉడికించినట్లుగానే ఉడికించాలి. దీంతో కందిపప్పు ఇడ్లీలు రెడీ అవుతాయి. వీటిని అల్లం లేదా పల్లి చట్నీ లేదా కారం పొండి, సాంబార్ లతో తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అందరూ ఇష్టంగా తింటారు. ఎప్పుడూ రొటీన్ ఇడ్లీలు కాకుండా ఒకసారి ఇలా వెరైటీ ఇడ్లీలను చేస్తే.. ఎవరైనా సరే ఇష్టపడతారు. రుచి చూస్తే మళ్లీ కావాలంటారు.