Chicken Sandwich : మనకు బేకరీల్లలో లభించే చికెన్ వెరైటీలల్లో చికెన్ సాండ్విచ్ కూడా ఒకటి. చికెన్ సాండ్విచ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే ఈ చికెన్ సాండ్విచ్ ను బయట కొనే పని లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఈ సాండ్విచ్ తయారీని తెలుసుకుంటే ఇంత సులభంగా సాండ్విచ్ ను తయారు చేసుకోవచ్చా అని మీరే అనుకుంటారు. చాలా సులభంగా అలాగే రుచిగా చికెన్ సాండ్విచ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ సాండ్విచ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, బోన్ లెస్ చికెన్ కీమా – 200 గ్రా., ఉప్పు – తగినంత, మిరియాల పొడి – అర టీ స్పూన్, మయనీస్ – అర కప్పు, క్యాప్సికం తరుగు – పావు కప్పు, బ్రెడ్ స్లైసెస్ – 2.
చికెన్ సాండ్విచ్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత చికెన్ కీమా వేసి వేయించాలి. ఇది సగానికి పైగా ఉడికిన తరువాత ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించాలి. చికెన్ ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఇందులో మయనీస్, క్యాప్సికం తరుగు వేసి కలపాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని వాటి అంచులను తీసి వేయాలి. తరువాత వాటిపై మరో టేబుల్ స్పూన్ మయనీస్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత బ్రెడ్ పై చికెన్ మిశ్రమాన్ని ఉంచి స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత దానిపై మరో బ్రెడ్ ను ఉంచి మధ్యలోకి కట్ చేసుకుని టమాట కిచప్ తో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ సాండ్విచ్ తయారవుతుంది. దీనిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. ఇలా ఇంట్లోనే చాలా సులభంగా, రుచిగా చికెన్ సాండ్విచ్ ను తయారు చేసుకుని తినవచ్చు.