Chikkudukaya Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో చిక్కడు కాయలు కూడా ఒకటి. చిక్కుడు కాయల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాఉల ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. చిక్కుడు కాయలతో ఎక్కువగా చేసే వంటకాల్లో చిక్కుడుకాయ ఫ్రై కూడా ఒకటి. ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. కేవలం చిక్కుడు కాయ ఫ్రై కాకుండా దీనితో చారు కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది. చిక్కుడు కాయ ఫ్రైతో పాటు చారును కూడా సులభంగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చిక్కుడుకాయ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కుడు కాయలు – అర కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్ లేదా తగినంత.
చారు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె -ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, ఎండుమిర్చి – 2, మెంతులు – పావు టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, పొడుగ్గా తరిగిన టమాట – 1, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – పావు టీ స్పూన్, చింతపండు – ఒక రెమ్మ, ధనియాలు – ఒక టీ స్పూన్, బెల్లం – ఒక చిన్న ముక్క.
చిక్కుడు కాయ ఫ్రై మరియు చారు తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చిక్కుడు కాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా కరకరలాడే వారు వేయించుకోవాలి. చిక్కుడు కాయలు పూర్తిగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, కారం వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ ఫ్రై తయారవుతుంది. ఇప్పుడు మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, మెంతులు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, ఉల్లిపాయ, టమాట వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇందులోనే ఉప్పు, పసుపు, మిరియాల పొడి, చింతపండు, ధనియాలు, బెల్లం ముక్క, కారం వేసి రెండు పొంగులు వచ్చే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చారు తయారవుతుంది. ఈ విధంగా చిక్కుడుకాయ ఫ్రై, చారు తయారు చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. వీటిని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.