Chikkudukaya Vepudu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో చిక్కుడుకాయలు కూడా ఒకటి. చిక్కుడుకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చిక్కుడుకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో చిక్కుడుకాయ వేపుడు కూడా ఒకటి. చిక్కుడుకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే తరుచూ ఒకేరకంగా కాకుండా ఈ చిక్కుడుకాయ వేపుడును మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. మరింత రుచిగా, అందరికి నచ్చేలా చిక్కుడుకాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిక్కుడుకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు- ఒక టీ స్పూన్, ధనియాలు -ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు – పావు కప్పు, ఎండుమిర్చి – 5 లేదా 6, వెల్లుల్లి రెబ్బలు- 6, చిక్కుడు కాయలు – పావుకిలో, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావుటీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
చిక్కుడుకాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. తరువాత శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, పచ్చికొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత చిక్కుడుకాయలను నీటిలో వేసి తగినంత ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి. తరువాత వీటిని వడకట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉడికించిన చిక్కుడుకాయలు వేసి కలపాలి. వీటిని 3 నిమిషాల పాటు వేయించిన తరువాత పసుపు, ఉప్పు, మిక్సీ పట్టుకున్న కారం వేసి కలపాలి.
తరువాత మూత పెట్టి మరో 3 నుండి 5 నిమిషాల పాటు వేయించాలి. చివరగా కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ వేపుడు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో పాటు పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా కూడా తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన చిక్కుడుకాయ వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.