Chole Bature : చోలే భాతురే.. మనకు హోటల్స్ లో, ధాబాలల్లో, రోడ్ల పక్కన లభించే అల్పాహారాల్లో ఇది కూడా ఒకటి. దీనిని ఎక్కువగా నార్త్ ఇండియాలో తయారు చేస్తూ ఉంటారు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ చోలే భాతురేను మనం కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. వీకెండ్స్ లో లేదా సమయం ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్ చోలే భాతురేను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చోలే భాతురే తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగలు ఉడికించడానికి కావల్సిన పదార్థాలు..
రాత్రంతా నానబెట్టిన కాబూలీ శనగలు – 200 గ్రా., టీ పొడి – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, అనాస పువ్వు – 1, యాలకులు – 2, నల్ల యాలక్కాయ – 1, జాప్రతి – కొద్దిగా, లవంగాలు – 4, ఉప్పు – అర టీ స్పూన్, నీళ్లు – ఒకటిన్నర కప్పులు.
కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, టమాట ముక్కలు – అర కప్పు, బటర్ – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, కారం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు- కొద్దిగా, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి – ఒక టీ స్పూన్, చోలే మసాలా – ఒక టీ స్పూన్, కసూరిమెంతి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
భాతురే తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒకటిన్నర కప్పు, రవ్వ – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – పావు టీ స్పూన్, వంటసోడా – చిటికెడు, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – ఒక టేబుల్ స్పూన్.
చోలే భాతురే తయారీ విధానం..
ముందుగా శనగలను శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, నీళ్లు, బిర్యానీ ఆకులు వేసుకోవాలి. తరువాత ఒక కాటన్ వస్త్రంలో టీ పౌడర్ తో పాటు మిగిలిన మసాలా దినుసులు వేసి మూట కట్టి కుక్కర్ లో వేసుకోవాలి. తరువాత మూత పెట్టి 3 నుండి 4విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత ఇందులో ఉండే బిర్యానీ ఆకులను, మసాలా మూటను తీసేయాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలువేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో బటర్, మరో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. తరువాత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, ఆమ్ చూర్ పొడి, చోలే మసాలా వేసి కలపాలి. తరువాత ఉడికించిన శనగలను వడకట్టి వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత శనగలు ఉడికించిన నీటితో పాటు మరో పావు కప్పు నీళ్లు పోసి కలపాలి. తరువాతమూత పెట్టి ఉడికించాలి. దీనిని 9 నుండి 10 నిమిషాల వరకు ఉడికించిన తరువాత కసూరిమెంతి, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్రీ తయారవుతుంది.
తరువాత గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టి అరగంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత పిండిని ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను తీసుకుంటూ నూనె రాసుకుంటూ ఎగ్ ఆకారంలో పూరీలాగా వత్తుకోవాలి. తరువాత వీటిని వేడి నూనెలో వేసి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చోలే భాతురే తయారవుతుంది. ఇలా తయారు చేసిన ఈ చోలే భాతురేను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.