Chicken Biryani : చికెన్ ను మనం తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. చికెన్ ను తినడం వల్ల మన శరీరానికి కావల్సిన ప్రోటీన్లతోపాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. చికెన్ తో వివిధ రకాల వంటలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాం. చికెన్ తో చేసుకోదగిన వంటకాల్లో చికెన్ దమ్ బిర్యానీ కూడా ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటుంది. చాలా సులభంగా ఈ చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ దమ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – ఒక కిలో, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా పొడి – 2 టీ స్పూన్స్, మిరియాల పొడి – 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పచ్చిమిర్చి – 4, తరిగిన కరివేపాకు – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, ఫ్రైడ్ ఆనియన్స్ – పావు కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పెరుగు – ముప్పావు కప్పు.
అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బాస్మతి బియ్యం – అర కిలో, నీళ్లు – రెండున్నర లీటర్లు, ఉప్పు – తగినంత, దాల్చిన చెక్క ముక్కలు – 2, యాలకులు – 3, లవంగాలు – 4, అనాస పువ్వు – 1, సాజీరా – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, నూనె – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – 3 టీ స్పూన్స్.
చికెన్ దమ్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో చికెన్ ను తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా చూసుకోవాలి. తరువాత అందులో ఉప్పు, కారం, పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత మిగిలిన పదార్థాల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ను 2 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచి మారినేట్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే బియ్యం, నెయ్యి తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి కలపాలి. ఈ బియ్యాన్ని మధ్యస్థ మంటపై 70 శాతం ఉడికే వరకు ఉడికించాలి. తరువాత జల్లిగంటెతో అన్నంలోని నీరు అంతా పోయేలా వడకట్టుకోవాలి.
ఇప్పుడు అడుగు భాగం మందంగా ఉండే గిన్నెను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనెను వేయాలి. తరువాత అందులో మారినేట్ చేసుకున్న చికెన్ ను వేసి సమానంగా చేసుకోవాలి. తరువాత దానిపై ఉడికించుకున్న అన్నాన్ని వేసి పై భాగం అంతా సమానంగా చేసుకోవాలి. తరువాత అన్నంపై వేయించిన ఉల్లిపాయలను, తరిగిన పుదీనాను, నెయ్యిని, కొద్దిగా ఫుడ్ కలర్ ను నీటిలో కలిపి వేయాలి. ఇప్పుడు ఆవిరి పోకుండా గోధుమ పిండిని కానీ ఫాయిల్ పేపర్ ను కానీ ఉంచి మూత పెట్టాలి.
తరువాత దీనిని 30 నిమిషాలు చిన్న మంటపై 15 నిమిషాలు మధ్యస్థ మంటపై ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన 10 నిమిషాల తరువాత మూత తీసి అంతా కలిపి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఘుమఘుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ తయారవుతుంది. దీనిని నేరుగా లేదా రైతా, మిర్చి కా సాలన్ వంటి వాటితో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా చేసిన దమ్ బిర్యానీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.