Eggs : కోడిగుడ్లతో సహజంగానే చాలా మంది రకరకాల కూరలు చేస్తుంటారు. కొందరు వేపుడు చేస్తే కొందరు టమాటాలు వేసి వండుతుంటారు. కొందరు కోడిగుడ్ల పులుసు చేస్తుంటారు. అయితే కోడిగుడ్లను, ఉల్లిపాయలను కలిపి వండి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే ఈ రెండింటిలో ఉండే పోషకాలు మనకు లభిస్తాయి. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మరి.. కోడిగుడ్లను, ఉల్లిపాయలను కలిపి ఎలా వండుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
కావల్సిన పదార్థాలు..
ఎర్ర ఉల్లిపాయ పెద్దది – 1, ఆలుగడ్డలు మీడియం సైజ్‌వి – 2, ఉల్లికాడలు తరిగినవి – 1 టేబుల్ స్పూన్, కోడిగుడ్లు – 4, ఉప్పు – అర టీస్పూన్, నల్ల మిరియాల పొడి – పావు టీస్పూన్, ఉడకబెట్టిన చికెన్ బోన్‌లెస్ – 50 గ్రా., కారం – తగినంత.
తయారు చేసే విధానం..
ఉల్లిపాయ, ఆలుగడ్డలను చిన్న ముక్కలుగా కట్‌చేయాలి. నిలువుగా సన్నగా వీటిని తరగాలి. కోడిగుడ్లను ఒక పాత్రలో పగలగొట్టి ఆ సొనలో ఉప్పు, నల్ల మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఉడకబెట్టిన బోన్‌లెస్ చికెన్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని అందులో నూనె వేసి కాగిన తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. 4-5 నిమిషాల పాటు వేగాక ఆలుగడ్డ ముక్కలను వేసి మళ్లీ వేయించాలి. ఆ తరువాత కాసేపు వేయించి మళ్లీ చికెన్ ముక్కలను వేసి వేయించాలి. అవి కూడా వేగిన తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న కోడిగుడ్ల మిశ్రమాన్ని వేయాలి.
అయితే దీన్ని ఆమ్లెట్‌లా లేదా కూరలా చేసుకుని తినవచ్చు. కూరలా చేయదలిస్తే కోడిగుడ్ల మిశ్రమం వేశాక దాన్ని బాగా కలపాలి. అనంతరం మూత పెట్టి ఉడికించాలి. బాగా ఉడికిన తరువాత చివరి దశలో మళ్లీ ఉప్పు వేసుకోవచ్చు. దాంతోపాటు కారం సరిపడా వేయాలి.
ఇక దీన్నే ఆమ్లెట్‌లా వేయాలంటే.. పాత్రలో ఉన్న వేగిన ఉల్లిపాయ, ఆలుగడ్డలు, చికెన్ ముక్కలను పాత్ర మొత్తం అయ్యేలా విస్తరించాలి. అనంతరం వాటిపై కోడిగుడ్ల మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పోయాలి. తరువాత దాన్ని కదిలించకుండా అలాగే ఉంచి పైన మూత పెట్టాలి. దాన్ని కాసేపు ఉడికిస్తే ఆమ్లెట్‌లా మారుతుంది. చివర్లో మళ్లీ తగినంత ఉప్పు, కారం పైన చల్లాలి. అంతే.. ఉల్లిపాయ, కోడిగుడ్లు, ఆలు.. ఆమ్లెట్ సిద్ధమవుతుంది. దీన్ని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా పోషకాలు కూడా లభిస్తాయి.