Crispy Baby Corn Rice : మనం వంటింట్లో రకరకాల రైస్ వెరైటీస్ ను తయారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీస్ చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. మనం సులభంగా, రుచిగా చేసుకోదగిన వివిధ రకాల రైస్ వెరైటీలలో క్రిస్పీ బేబికార్న్ రైస్ కూడా ఒకటి. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఎంతో రుచిగా, సులభంగా చేసుకోగలిగే ఈ బేబికార్న్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో… ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ బేబికార్న్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బేబికార్న్ ముక్కలు – పావుకిలో, మైదాపిండి – 2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, చాట్ మసాలా – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ముప్పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, చిన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ – 1, మిరియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, అన్నం – ముప్పావు కప్పు బియ్యంతో వండినంత, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.
క్రిస్పీ బేబికార్న్ రైస్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక బేబి కార్న్ ముక్కలు వేసి మూత పెట్టి 80 శాతం ఉడికించాలి. తరువాత వీటిని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో మైదాపిండి, బియ్యంపిండి, చాట్ మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లుపోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బేబికార్న్ ముక్కలు వేసి బాగా కలపాలి. తరువాత వీటిని వేడి వేడి నూనెలో వేసి మధ్యస్థ మంటపై ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో 2 టీ స్పూన్స్ నూనె వేసి కలపాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత గరం మసాలా ఒక టీ స్పూన్, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. తరువాత వేయించిన బేబికార్న్ వేసి కలపాలి. తరువాత ఉడికించిన అన్నం, కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బేబికార్న్ రైస్ తయారవుతుంది. దీనిని టమాట కిచప్, షెజ్వాన్ సాస్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.