Crispy Corn Fried Rice : మనం స్వీట్ కార్న్ కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. స్వీట్ కార్న్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. స్వీట్ కార్న్ తో మనం రకరకాల వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. స్వీట్ కార్న్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. కార్న్ తో చేసే ఈ రైస్ వెరైటీ చాలా రుచిగా ఉంటుంది. స్పైసీగా, రుచిగా ఉండే ప్రైడ్ రైస్ ను తయారు చేయడం చాలా తేలిక. ఎవరైనా దీనిని సులవుగా తయారు చేయవచ్చు. స్వీట్ కార్న్ తో ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్ ను ఎలా తయారు చేయాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
స్వీట్ కార్న్ – అర కప్పు, ఉప్పు – చిటికెడు, మిరియాల పొడి – 2 చిటికెలు, మైదా పిండి – ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
ఫ్రైడ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 3 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, సన్నని ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, క్యారెట్ తరుగు – పావు కప్పు, బీన్స్ తరుగు – పావు కప్పు, అన్నం – ఒక కప్పు బాస్మతీ బియ్యంలో ఉప్పు వేసి వండినంత, మిరియాల పొడి – అర టీ స్పూన్, డార్క్ సోయా సాస్ – అర టీ స్పూన్, వెనిగర్ – అర టీ స్పూన్, పంచదార – అర టీ స్పూన్, తెల్ల మిరియాల పొడి – ఒక టీ స్పూన్, చైనీస్ చిల్లీ పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు – 2 టేబుల్ స్పూన్స్.
క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీటిని తీసుకుని బాగా వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత స్వీట్ కార్న్ వేసి ఉడికించాలి. వీటిని మెత్తగా ఉడికించిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకుని చల్లటి నీటిని పోసుకోవాలి. తరువాత వీటిని నీళ్లు లేకుండా పూర్తిగా వడకట్టి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నీళ్లు పోసి పిండి గింజలకు పట్టేలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా సిద్దం చేసుకున్న స్వీట్ కార్న్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై క్రిస్పీగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం తరుగు వేసి వేయించాలి.
ఉల్లిపాయ మెత్తబడిన తరువాత వేయించిన కార్న్ వేసి టాస్ చేసుకోవాలి. తరువాత క్యారెట్, బీన్స్ వేసి పెద్ద మంటపై 3 నిమిషాల పాటు టాస్ చేసుకోవాలి. తరువాత అన్నం వేసి కలపాలి. ఇప్పుడు మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్, పంచదార, తెల్ల మిరియాల పొడి వేసి కలపాలి. తరువాత చిల్లీ పేస్ట్ వేసి కలపాలి. చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ లోకి కూడా ఈ వంటకం చాలా చక్కగా ఉంటుంది.